జనసేన పార్టీలోకి నాగబాబు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినపుడు.. దాని పట్ల వ్యతిరేకత చూపించాడు ఆయన అన్న నాగబాబు. మెగా అభిమానులందరూ చిరంజీవి వెంటే ఉండాలని.. తాను కూడా అన్నయ్య పక్కనే ఉంటానని స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారుతున్నట్లుంది. చిరంజీవి రాజకీయాల్లో నెమ్మదిగా ఇన్ యాక్టివ్ అయిపోతున్న నేపథ్యంలో తమ్ముడి వైపు మొగ్గుతున్నట్లున్నాడు నాగబాబు. ఈ మధ్య జనసేన మద్దతిచ్చిన విశాఖ నిరసన ర్యాలీకి నాగబాబు కూడా సపోర్ట్ చేయడం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే 2019 ఎన్నికలకు ముందు నాగబాబు జనసేన తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ కోసం పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

‘‘పార్టీలో నా ప్రమేయం ఎంత మేరకు ఉంటుందన్నది తెలియదు. ఐతే నా తమ్ముడు నా సాయం కోరితే మాత్రం నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. నా అంతట నేనే కూడా పవన్ దగ్గరికి వెళ్లి పార్టీ కోసం పని చేస్తానని అడుగుతానేమో. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నా’’ అని నాగబాబు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ కు – తనకు కొన్ని విషయాల్లో విరుద్ధ అభిప్రాయాలున్నప్పటికీ తాను అతడికి మద్దతుగా నిలుస్తానని.. ప్రత్యేక హోదా డిమాండ్ కు కూడా తన మద్దతు ఉంటుందని నాగబాబు వ్యాఖ్యానించాడు. ఇక మెగా ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ అంటీ ముట్టనట్లు ఉండటం.. ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు పవన్ దూరంగా ఉండటంపై నాగబాబు స్పందిస్తూ.. ‘‘చిరంజీవి మీద కళ్యాణ్ కు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. వాడితో ఉన్న సమస్య ఏంటంటే.. తన ప్రేమను బయటికి వెల్లడించలేడు. అన్నయ్య మీద తన ప్రేమను ఎవరూ శంకించలేరు. ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ పవన్ చరణ్ కు ఎంత సపోర్ట్ చేశాడో చాలామందికి తెలియదు. అతను బిజీగా ఉండటం వల్లే ప్రి రిలీజ్ ఈవెంట్కు రాలేకపోయాడు’’ అని నాగబాబు అన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *