‘ఎర్రబుగ్గ’పై బ్యాన్‌ పడింది

ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు చెక్‌ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌ ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో  ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. మే 1వ తేదీ నుంచి  ఈ ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై  ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌ సభ స్పీకర్‌ మాత్రమే బుగ్గకార్ల వినియోగించేందుకు అనుమతి ఉంది. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో  వీఐపీ కల్చర్‌కి చరమగీతం పాడినట్లు అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై అక్కడ ముఖ్యమంత్రులు బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే.

కాగా  2002, 2005లో కేంద్రం జారీ చేసిన  నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *