రివ్యూ : నెక్స్ట్ నువ్వే – కామెడీ ఉంది

కథ :

సీరియల్స్ ను డైరెక్ట్ చేసే కిరణ్ (ఆది) ఒక లోకల్ గుండాకి ఇవ్వాల్సిన అప్పు కారణంగా సిటీ నుండి పారిపోయి అరకులో తన తండ్రి సంపాదించిన ఒక బంగ్లాకు వెళ్లి, దాన్ని రీమోడలింగ్ చేయించి రిసార్ట్స్ గా మార్చి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కానీ రిసార్ట్స్ కు వచ్చిన గెస్టులంతా చనిపోతుంటారు.

దీంతో అయోమయంలో పడ్డ కిరణ్ అసలు వాళ్ళ చావుకి కారణమేమిటో తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి ఆ ఇంట్లో దెయ్యముందనే విషయంతో పాటు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ దెయ్యం ఎవరు, అది రిసార్ట్స్ లో ఎందుకుంది, కిరణ్ తెలుసుకున్న నిజాలేమిటి, చివరికి కిరణ్ తన రిసార్ట్స్ ను ఆ దెయ్యం బారి నుండి కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలు ప్రధాన ప్లస్ పాయింట్ బ్రహ్మాజీ కామెడీ ట్రాక్. సినిమా ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే బ్రహ్మాజీ కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ముఖ్యంగా మొదటి అర్థ భాగంలో ప్రతి ఐదు నిముషాలకు ఒక కామెడీ సీన్ వచ్చి ఆహ్లాదాన్ని పంచింది. బ్రహ్మాజీ ఇది వరకు ఎన్నో ఎంటర్టైనింగ్ పాత్రలు ఈ సినిమాలో చేసిన పాత్ర మాత్రం భిన్నంగా ఉంది. అమాయకత్వంతో పాటు కొద్దిగా తింగరితనం కలగలిసిన అతని పాత్ర మంచి రిలీజ్ ను అందించింది. బ్రహ్మాజీ కూడా సరైన కామెడీ టైమింగ్ తో పాటు, నవ్వు తెప్పించే బాడీ లాంగ్వేజ్ తో పాత్రకు న్యాయం చేశాడు.

ఇక సినిమాను నార్మల్ గానే స్టార్ట్ చేసిన దర్శకుడు ప్రభాకర్ కొద్దిసేపటికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జానర్లోకి తీసుకెళ్లి ఇంటర్వెల్ వరకు పర్వాలేదని రీతిలో ఆహ్లాదాన్ని అందించాడు. ఇక బ్రహ్మాజీ చెల్లెలిగా రష్మీ నటన మాస్ ఆడియన్సుకు కొంత వరకు కనెక్టవుతుంది. కీలక సన్నివేశాల్లో సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రెండవ అర్థ భాగంలో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ కొంతమేర పర్వాలేదనిపించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ సెకండాఫ్ కథనం. ఇంటెర్వెల్ వరకు ఏదోలా కామెడీతో సినిమాను లాగించేసిన ప్రభాకర్ రెండవ అర్థ భాగం మొదలైన కూడా సినిమా కథేమిటో రివీల్ చేయకపోవడం పెద్ద తప్పిదం. అసలు రిసార్ట్స్ లో దెయ్యం ఎందుకుంది, దాని కథేమిటి, దానికేం కావాలి, అతిథులందరినీ ఎందుకు చంపుతుంది వంటి కీలక అంశాలకి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో సినిమా కంక్లూజన్ ఏమిటో అస్సలు అవగతం కాలేదు.

సెకండాఫ్ లో మొదలయ్యే దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తో సహా కొన్ని పాత్రలు ఎందుకొస్తాయి, ఎందుకు పోతాయి అస్సలు అర్థం కాదు. ఇది ఖచ్చితంగా దర్శకత్వ లోపమనే చెప్పాలి. దీంతో సెకండాఫ్ మొత్తం సాగదీయబడిన నాటికలా తయారై ఎప్పుడెప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందా అనిపించింది. దానికి తోడు తాగుబోతు రమేష్, పోలీసుల ట్రాక్, రఘుబాబు ఎంట్రీ వంటివి మరింత చికాకు పెట్టాయి. ఇన్ని డ్రా బ్యాక్స్ నడుమ బ్రహ్మాజీ తన కామెడీతో నవ్వించడానికి చేసిన ప్రయత్నం సెకండాఫ్ వరకు వృధా ప్రయత్నంగానే మిగిలిపోయింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రభాకర్ హర్రర్ జానర్ ను ఎంచుకున్నాడే కానీ దానికి తగిన కథను, కథనాన్ని రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కానీ బ్రహ్మాజీతో మంచి కామెడీ ట్రాక్ ను తయారుచేసి కొంత వరకు పర్వాలేదనిపించాడు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. తీసింది కొని లొకేషన్లలోనే అయినా చక్కగా చేశాడు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసర సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ లు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విడుదల తేదీ : నవంబర్ 3, 2017

రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రభాకర్

నిర్మాత : బన్నీ వాస్

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : ఆది, వైభవి, రష్మీ, బ్రహ్మాజీ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *