తెలంగాణ అమ్మాయిలు పనికిరారా? : షబ్బీర్‌

రాష్ట్రంలో చేనేతను ఆదరించడానికి, చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి సమంత తప్ప రాష్ట్రంలో ఇంకెవ్వరూ కనిపించలేదా? అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతను పరిరక్షించే ఉద్యమం కొత్తగా చేపట్టడమే విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆయనకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఇంతటితో చాలదన్నట్లు సినీ నటి సమంతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడమేమిటని ప్రశ్నించారు.

ఇది తెలంగాణ ఆడపడుచులను అవమానపర్చడమేనన్నారు. . బ్రాడ్‌ అంబాసిడర్‌గా తెలంగాణ అమ్మాయిలు పనికిరారా అని ప్రశ్నించారు. సమంత సినీ నటుడు అక్కినేని నాగార్జునకు కాబోయే కోడలని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను 15 రోజుల్లో కూల్చివేస్తామని ప్రగల్భాలు పలికిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఇదంతా లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే జరుగుతోందని అన్నారు. కరీంనగర్‌ సభలో కేటీఆర్‌ తన స్థాయి మరిచి మాట్లాడారని, తెలంగాణ ఆకాంక్షలను కాలరాస్తూ టీఆర్‌ఎస్‌ సర్కారు సాగిస్తున్న పాలన వల్ల ప్రజలు వారినే చెప్పులతో కొట్టే రోజులు దగ్గరికొచ్చాయని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *