దటీజ్ జూనియర్ అంటున్నారు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తీరని శోకాన్ని మిగిల్చిన నాన్న హరికృష్ణ మరణం తాలూకు షాక్ నుంచి కోలుకోవడం అంత సులభం కాకపోయినా తారక్ మాత్రం గుండె రాయి చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ తాలూకు కీలకమైన బాలన్స్ ఇంకా చాలా ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం తీస్తే తప్ప ముందు అనుకున్న అక్టోబర్ 11 రిలీజ్ సాధ్యం కాదు. ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. పదో రోజు కర్మ తదితర కార్యక్రమాల కోసం మరో రెండు రోజులు వెళ్ళిపోతుంది.

ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న ముప్పై ఐదు రోజుల లోపే ఫస్ట్ కాపీ రెడీ చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే తారక్ ఈ రోజు నుంచి షూటింగ్ లో తిరిగి పాల్గొనబోతున్నట్టు సమాచారం. వాయిదా వేద్దామని త్రివిక్రమ్ చెప్పినప్పటికీ నిర్మాణ పరంగా దానికి నిర్మాత చాలా మూల్యం చెల్లించాల్సి రావడంతో పాటు ఆర్టిస్టుల కాంబోలో కాల్ షీట్స్ దోరకడం కష్టం కాబట్టి ఆలోచించే తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బాధాకరం ఏంటంటే నాన్నను పోగొట్టుకున్న మూడ్ లోనే పాటల చిత్రీకరణలో పాల్గొనాల్సి రావడం.

ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం నిజంగానే మెచ్చుకోదగినది. దసరా సీజన్ ని వదిలేస్తే ఆ తర్వాత మళ్ళి సంక్రాంతి దాకా సరైన డేట్ దొరకదు. నవంబర్ లేదా డిసెంబర్ ప్లాన్ చేసుకున్నా భారీ సినిమాలకు అది రైట్ టైం కాదు. పరీక్షలతో పాటు సెలవుల కొరత వసూళ్ల మీద బాగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ సంక్రాంతికి అనుకుంటే ఇప్పటికే బాబాయ్ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్, ఫ్రెండ్ రామ్ చరణ్ సినిమాలతో పాటు వరుణ్ వెంకటేష్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా రేస్ లో ఉంది.

థియేటర్ల సమస్యతో పాటు ఆ టైంలో అరవిందను తీసుకెళ్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇన్ని సమీకరణలు ఉన్నాయి కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ గుండె రాయి చేసుకుని షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఇదే స్టేటస్ లో ఉన్న తన సినిమా కోసం కళ్యాణ్ రామ్ సైతం గుహన్ దర్శకత్వంలో బాలన్స్ ఫినిష్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. సినిమా రంగమంటే అంతే. గ్లామర్ తో పాటు ఇలాంటి కఠిన పరీక్షలు కూడా ఉంటాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *