నేడే ఓయూ శతాబ్ది వేడుక

ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న వందేళ్ల వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. చరిత్రాత్మక ఉత్సవాలకు వేదికగా ఉన్న ఏ గ్రౌండ్స్‌ ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఏ గ్రౌండ్స్‌ను, సభాస్థలిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పదహారు వేల మంది అతిథులకు ఈ వేదిక ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ వేడుకలను దేశ ప్రథమ పౌరుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హై సెక్యురిటీ జోన్‌గా పరిగణిస్తూ వర్సిటీ మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. వేడుక సందర్భంగా ఎంట్రీ పాస్‌ కాని, ఆహ్వాన పత్రికకానీ లేకుంటే బుధవారం క్యాంప్‌సలోకి అనుమతించేదిలేదని తేల్చిచెప్పారు. వీటితోపాటు ఆధార్‌కార్డ్‌ తప్పనిసరిగా తీసుకురవాలని అతిథులకు సూచిస్తున్నారు. మరోపక్క మొబైల్‌ ఫోన్లను కూడా సభలోకి అనుమతించడంలేదు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మధ్యాహ్నం 12.30నుంచి గంటసేపు ఉన్నా ఉదయం 11.30 కల్లా ఎవరికి కేటాయించిన గ్యాలరీలోకి వారు చేరుకోవాలని ఇటు పోలీసులు, అటు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రత నిమిత్తం మొత్తం 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

సభలోనూ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో నిఘా నిమిత్తం 170 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. దీనితోపాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులతో వీసీ సమావేశం నిర్వహించారు. వారి డిమాండ్లను తీర్చే బాధ్యతను తీసుకుంటానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థి నాయకులు వేడుకలకు మద్దతు తెలిపారు.వేడుకలను రాష్ట్రపతి మధ్యాహ్నం ప్రారంభించనున్నా.. ఉదయం 10.30 నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అమరవీరుల స్మరణతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ‘వందేళ్లు-వంద గళాలు’ కార్యక్రమంలో వందమంది గాయకులు సారే జహసే అచ్చా గీతాన్ని ఆలపిస్తారని, నందిని సిధారెడ్డితో తెలంగాణ కోటి రతనాలవీణ, వారాసి బ్రదర్స్‌తో కవాలి, ‘వందేళ్లు వంద నర్తనాలు’ పేరిణి కళాకారులతో తాండవం-లాస్యం నృత్యం, శివారెడ్డి మిమిక్రి, వందేళ్లు వంద జానపదులువంటి తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఆర్ట్స్‌ కళాశాల ముందు సాయంత్రం 6.30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

అతిథులు.. ఏర్పాట్లు..
వేడుకకు మొత్తం 16 వేల మంది హాజరు కానున్నారు. ఎంట్రీపా్‌సలు, ఆహ్వానాలు ఇవ్వడం పూర్తయ్యింది. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని అతిథుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. భారీగా ఏసీలు, కూలర్లు ఏర్పాటుచేశారు. చల్లదనంకోసం 2 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలను వినియోగించడం విశేషం. తాగునీరు, మొబైల్‌ మరుగుదొడ్లను సిద్ధం చేశారు. అతిథుల భోజన ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా వికేంద్రీకరణ విధానంలో వసతి గృహాలను ఉపయోగించుకోనున్నారు. వాటి నిర్వహణ బాధ్యత కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. వీటితోపాటు ఓయూసిప్‌, ఐపీఈ సెంటర్లలోనూ భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేయనున్నారు. వీఐపీలకు, ప్రత్యేక ఆహ్వానితులకు, పూర్వ విద్యార్థులకు.. ఇలా విడివిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ప్రధాన వేడుకకే రూ.28కోట్ల వరకు వెచ్చించనున్నట్లు సమాచారం.

వేదిక ప్రాంగణంలో ఎవరి సీట్లు వారికే

వేదిక ముందు వరుసలో కుడి, ఎడమ వైపు ఎరుపు సీట్లు వీఐపీలకు, మధ్యలో లేత నీలం రంగు సీట్లు మీడియాకు కేటాయించారు. ఇక ఎడమవైపు రెండో విభాగం (ముదురు పసుపు)లో విద్యాశాఖకు చెందిన అధికారులు వీసీలు, ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు, మూడో విభాగం(పర్పుల్)లో అధ్యాపకులు, ఆ వెనుక రెండు విభాగాలు (పసుపు)లో నాన్ టీచింగ్ ఉద్యోగులు, ఆ వెనుక విభాగం(నలుపు)లో దివ్యాంగ విద్యార్థులు కూర్చునేందుకు కేటాయించారు. ఇక కుడివైపు వీఐపీల సీట్ల వెనుక మూడు విభాగాల (ఆకుపచ్చ)లో పూర్వ విద్యార్థులు కూర్చుంటారు. ఆ వెనుక రెండు విభాగాలు (నీలిరంగు) అనుబంధ కళాశాలలకు కేటాయించారు. ఆ వెనుక రెండు వైపులా రెండు విభాగాలు (బ్రౌన్) విద్యార్థినులకు, నాలుగు విభాగాలు (నీలి) విద్యార్థులకు కేటాయించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *