భారత్ పై అక్కసును వెళ్లగక్కుతున్న పాక్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ మీద తన అక్కసును వెళ్లగక్కారు. సోమవారం ఇమ్రాన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..భారత్‌పై మరోసారి విమర్శలకు దిగారు. కశ్మీర్ విధానంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి పొరుగు దేశాలతో శాంతి కోసం ప్రయత్నించింది. ఇరు కశ్మీరు అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోడానికి మీరు ఒక అడుగు వేస్తే, మేం రెండడుగులు వేస్తామని చెప్పాం. కానీ ఉగ్రవాదం వంటి సాకులు చూపించి భారత్‌ తప్పించుకుంది. అంతలోనే ఎన్నికలు రాగానే పాక్‌ వ్యతిరేక ప్రచారంతో ముందుకెళ్లింది. పుల్వామ ఘటనకు సంబంధించి తప్పంతా పాక్‌ మీదే తోసింది. దాంతో మేం ఒకడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూశాం. కానీ భారత్ మాత్రం ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చడానికి, అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఆగస్టు 5న కశ్మీర్ మీద ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మోదీ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. అయితే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడంలో మేం విజయం సాధించాం. 1965 తరవాత కశ్మీర్ అంశంపై ఐరాస సమావేశాన్ని నిర్వహించింది. అలాగే సెప్టెంబరు 27న ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నాను’ అని భారత్ మీద నిందలు వేస్తూ, తన ప్రజల వద్ద మార్కులు కొట్టేయడానికి ఇమ్రాన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. అంతటితో ఆగకుండా అణుయుద్ధం గురించి ప్రస్తావిస్తూ హెచ్చరికలు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *