‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ

కథ :
ఏబీ గ్రూప్ అథినేత గోవింద భార్గవ్ తో(బొమన్ ఇరానీ) పాటుగా అతడి వారసుడిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి బాలసుబ్రహ్మణ్యం (పవన్ కళ్యాణ్ ) అనే వ్యక్తిని తీసుకువస్తుంది. ఏబీ గ్రూప్ లో  మేనేజర్ గా జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం… గోవింద భార్గవ్ వారసుడి హత్యకు కారణాలను అన్వేషించటం మొదలు పెడతాడు. ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా..? అసలు ఈ హత్య చేసింది ఎవరు..? గోవింద్ భార్గవ్, సీతారామ్‌ (ఆది పినిశెట్టి)లకు సంబంధం ఏంటి..? హత్యకు కారణాలు తెలుసుకోవడానికి ఇంద్రాణీ బాలసుబ్రహ్మణ్యాన్నే ఎందుకు ఎంచుకుంది..? బాలసుబ్రహ్మణ్యం.. అభిషిక్త భార్గవ్‌ ఎలా అయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తనకు అలావాటైన మేనరిజమ్స్, స్టైల్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లో పవన్ లుక్స్, యాక్టింగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తాయి. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లోనూ పవన్ తన పరిణితి చూపించాడు. ఇక తనదైన రొమాంటిక్, కామెడీ టచ్ తో సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపించారు. అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్ నటి ఖుష్బూ తన స్థాయికి తగ్గ పాత్రలో కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఖుష్బూ  నటనన సినిమాకు ప్లస్ అయ్యింది. స్టైలిష్ విలన్ గా ఆది పినిశెట్టి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పాత్రలో ఎక్కువగా సరైనోడు సినిమాలోని వైరం ధనుష్‌ ఛాయలు కనిపించాయి. బొమన్ ఇరానీ, రావూ రమేష్, మురళీ శర్మలు పాత్రలకు తమవంతు న్యాయం చేశారు.

విశ్లేషణ :
పూర్తి అదే కథ కాకపోయినా.. అజ‍్ఞాతవాసి.. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్‌ ఇన్సిపిరేషన్ తో తెరకెక్కించారనే అనిపించటం ఖాయం. ఓ వ్యాపార సామ్రాజానికి వారసుడి హత్యకు సంబంధించిన హంతకుల కోసం వెతకటం అనే పాయింట్ తోనే అజ్ఞాతవాసి సినిమా కూడా రూపొందింది. అయితే ఈ కథను మన నేటివిటికీ తగ్గట్టు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి కామెడీ జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించాడు త్రివిక్రమ్‌.

పవన్ ఇమేజ్‌కు, ఫాలోయింగ్ కు తగ్గ ఫర్పెక్ట్ కథతో ఆడియన్స్ ను ఖుషీ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో పాటు.. ఆలోచింపచేసే మాటల ప్రయోగాలతో అలరించాడు. అభిమానులు పవర్ స్టార్ ను ఎలా చూడాలనుకుంటున్నారో.. పర్ఫెక్ట్ గా అలాగే తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ప్రతీ నాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. కానీ అజ్ఞాతవాసిలో విలన్ పాత్రను అంత బలంగా రూపొందించలేదు. దీంతో హీరో పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఎలివేట్ అవ్వలేదు. తొలి భాగంలో కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు స్లోగా కథ నడిపించిన త్రివిక్రమ్‌ తరువాత ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఆడియన్స్ ను కథలో లీనం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే త్రివిక్రమ్ కలం కాస్త పదును తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ గత చిత్రాల ఛాయలు కూడా కనిపిస్తాయి.

సినిమాకు మరో పస్ల్‌ పాయింట్ మణికందన్ సినిమాటోగ్రఫి. ఫారిన్ లోకేషన్స్ తో పాటు పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సన్నివేశాలను కూడా చాలా అందంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ లో మణికందన్ పనితనం వావ్ అనిపిస్తుంది తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన మ్యూజిక్ సెన్సేషన్ ఫస్ట్ అటెంప్ట్‌ లో పరవాలేదనిపించాడు. ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరరావు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. రెండు గంటల 40 నిమిషాల సినిమా నిడివి కాస్త ఇబ్బంది పెడుతుంది. హారికా హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రూపొందించాడు. ఆయన పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :
పవన్ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
మురళీ శర్మ, రావూ రమేష్ కామెడీ

మైనస్ పాయింట్స్ :
సినిమా నిడివి
బలమైన ప్రతినాయక పాత్ర లేకపోవటం
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌

టైటిల్ : అజ్ఞాతవాసి
జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా
తారాగణం : పవన్ కళ్యాణ్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేష్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : రాధాకృష్ణ

రేటింగ్- 2.5/5

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *