ప్రజలంటే ఆటలుగా ఉందా? చేతులు ముడుచుకుని కూర్చోం: పవన్

హైదరాబాద్: ప్రజలంటే ఆటలుగా ఉందా? చేతులు ముడుచుకుని కూర్చుంటామని అనుకుంటున్నారా? అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై పవన్ కళ్యాణ్ శుక్రవార ఉదయం ఆవేశం మాట్లాడారు. ప్రత్యేక హోదా అడుగుతుంటే రాజకీయ అనుభవం ఉందా? అని అడుగుతున్నారని, తాను ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు అడగలేదే ఈ ప్రశ్న అని పవన్ నిలదీశారు. ఇప్పటికే పరిష్కారం చేయాల్సిన సమస్యను ఆలస్యం చేస్తున్నారని అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా హోదాకు పరిష్కారం లభించలేదని అన్నారు. ప్రజల ఇబ్బందులను చూసి ఆవేదనతోనే పార్టీ పెట్టానని పవన్ తెలిపారు.

ప్రజలు కోరుకున్నది బిజెపి ప్రభుత్వం చేయడం లేదని, తాను అనుకున్నది మాత్రమే చేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బిజెపి పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, రోహిత్ వేముల, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి నియంత ప్రజాస్వామ్యంగా కనిపిస్తోందని అన్నారు.

బిజెపి నాయకత్వాన్ని ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా.. తనకు మింగుడు పడటం లేదని అన్నారు. ద్రావిడ సంస్కృతిని కించపర్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. జల్లికట్టుపై కేంద్రం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు.

జల్లికట్టు అనేది ఎద్దులను లొంగదీసుకునే ప్రక్రియ కాదని, ఇక్కడి సంస్కృతిలో భాగమని చెప్పారు. తమిళ నేతలు బిజెపిని ఎదిరించలేకపోతుంటే తాను ముందుకు వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలిపానని చెప్పారు.

ఏపీ హోదా కోసం ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు గొంతుచించుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక అది సంజీవనా అని అంటున్నారని అన్నారు. లేదంటే మర్చిపోయిన, గతించిన అధ్యాయమని అంటున్నారని మండిపడ్డారు. వెంకయ్యనాయుడు తన స్వర్ణ భారతి ట్రస్ట్ మీద పెట్టిన శ్రద్ద హోదా మీద పెట్టుంటే ఇప్పటికే వచ్చిండేదని ఎద్దేవా చేశారు. హోదా కావాలని, అవసరం లేదని.. మూడేళ్లలో ఇన్ని మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్ని సన్మానాలు చేసుకున్నాప్రజలు వెంకయ్యను నమ్మరని చెప్పారు. హోదా పదేళ్లు ప్రసాదిస్తామంటున్నారని.. వారేమైనా దేవుళ్లా? మేమందరం మీ బానిసలమా? అంటూ మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించమని పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *