ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్!

వచ్చేనెల 14 నుంచి ప్రతి ఆదివారం వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్) పాటించనున్నట్లు పెట్రోల్ బంకుల డీలర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంధనం నిత్యావసర సరుకుగా మారిన నేపథ్యంలో ఒక రోజు దేశవ్యాప్తంగా అన్ని బంకులు మూసి ఉంటే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కమీషన్‌ను పెంచాలన్న డిమాండు పరిష్కారానికి నోచుకోకపోవడంతో డీలర్లు వినూత్న తరహాలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చేనెల 14 నుంచి ప్రతి ఆదివారం బంకులు వారాంతపు సెలవు పాటించనున్నాయి. మే 10న నో పర్చేజ్ డేగా(కొనుగోళ్ల నిరాకరణ దినం) పాటించనున్నారు. అంటే బంకు డీలర్లెవరూ సంస్థల నుంచి ఇంధనం కొనుగోలు చేయరన్నమాట. ఫలితంగా తర్వాత రోజుల్లో బంకుల్లో ఇంధన కొరత సమస్య ఏర్పడనుంది.

ఈ విషయంపై పెట్రోల్ డీలర్ల అసోసియేషన్‌కు చెందిన రవి షిండే మాట్లాడుతూ.. గడిచిన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీలర్లందరితోనూ చర్చలు జరిపాం. డీలర్లకు కమీషన్ భారీగా పెంచుతామని నాలుగు నెలల క్రితం ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. దాంతో జనవరిలో తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా విరమించుకున్నాం. కానీ ఇప్పటివరకు మా డిమాండ్ నెరవేరలేదు అని అన్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక ప్రకారం కమీషన్ పెంచకపోవడంపై దేశంలోని పెట్రోల్ డీలర్లందరూ అసంతృప్తితో ఉన్నారని షిండే అన్నారు. ప్రభుత్వానికి మే 10 వరకు గడువిస్తున్నాం. అప్పటిలోగా మా డిమాండ్ పరిష్కారం కాకపోతే.. పదో తేదీన సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయబోం.

ఆ తర్వాత వచ్చే ఆదివారం(మే 14) నాడు బంకులను పూర్తిగా మూసివేసి ఉంచుతాం. ఆ మరుసటి రోజు(మే 15) నుంచి డీలర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకే ఇంధనం విక్రయించనున్నారు. డిమాండ్ పరిష్కారమయ్యే వరకు నిరసనను కొనసాగిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రస్తుతం డీలర్లకు కిలోలీటరు(వెయ్యి లీటర్లు) పెట్రోల్‌పై రూ.3,333, డీజిల్‌పై రూ.1,620 కమీషన్ లభిస్తున్నది. పెట్రోల్‌పై కమీషన్ చెల్లింపులను రూ.3,333 కు, డీజిల్‌పై రూ.2,126కు పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *