ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా

తిరుమల: శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి నటుడు పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినట్టు వచ్చిన ఆరోపణలపై తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆడియోలోని వాయిస్ శాంపిల్స్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపి పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నారు. పృథ్వీరాజ్ విషయాన్ని సీఎం జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి తెలియజేయగా, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. దాంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి రాజీనామా చేస్తున్న విషయాన్ని పృథ్వీరాజ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీకి కొన్ని సిద్థాంతాలు ఉన్నాయని, వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తిరుమలలో ఉన్నప్పుడు రాజకీయాలు కూడా మాట్లాడేవాడిని కాదని చెప్పారు. గత 9 నెలలుగా తాను మద్యం తాగలేదని, కావాలనుకొంటే తన రక్తం నమూనాలను పరీక్షించుకోవచ్చునన్నారు. చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుంచి కంటిమీద కునుకులేకుండా పని చేస్తున్నానని తెలిపారు. తాను అసలు రైతుల గురించి ఏమీ మాట్లాడలేదని, బినామీ ముసుగులో ఉన్న కార్పొరేట్ రైతులను మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులని అన్నట్టు పేర్కొన్నారు. తనపై పథకం ప్రకారం కుట్ర జరుగుతున్నదని చెప్పారు. పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్యలాంటి వాడని, ఆయనతో ఎలాంటి గొడవలు లేవన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *