రివ్యూ : ‘గరుడ వేగ’ మూవీ

చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఆఫీసర్. తన భార్యకు కూడా తెలియకుండా అనేక సీక్రెట్ ఆపరేషన్లలో పాల్గొంటుంటాడు. దీంతో తన భార్య అతణ్ని అపార్థం చేసుకుని విడాకులు కావాలని గొడవ పెడుతుంటుంది. ఇదిలా ఉండగానే చంద్రశేఖర్ ఓ కొత్త ముందుకు ఓ కొత్త మిషన్ వస్తుంది. హైదరాబాద్ లో ఉగ్రవాదులు భారీ బాంబు పేలుడుకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తుంది. మరి చంద్రశేఖర్ ఆ కుట్రను ఎలా ఛేదించాడు.. ఇంతకీ ఆ పేలుడు కుట్ర వెనుక ఉన్నది ఎవరు.. వాళ్ల లక్ష్యమేంటి.. వీళ్లందరినీ చంద్రశేఖర్ ఎలా పట్టుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

గత దశాబ్దంలో చెత్త చెత్త సినిమాలు చేసి మార్కెట్ కోల్పోయిన రాజశేఖర్ హీరోగా పాతిక కోట్ల సినిమా అనగానే.. ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఊరికే పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది ఈ మాట. కానీ ‘గరుడవేగ’ టీజర్.. ట్రైలర్ చూస్తే మాత్రం ఇది తేలిగ్గా కొట్టిపారేయదగ్గ సినిమా ఏమీ కాదనిపించింది. ఐతే టీజర్.. ట్రైలర్లను అందమైన ప్యాకేజీలా తీర్చిదిద్ది.. సినిమాను తేల్చిపడేసే ఫిల్మ్ మేకర్స్ ను కూడా చాలామందిని చూశాం. కాబట్టి సినిమా ‘గరుడవేగ’ సినిమా చూసే వరకు సందేహమే. ఐతే ‘గరుడవేగ’ సినిమా చూశాక మాత్రం దీని మీద పెట్టుకున్న సందేహాలు తొలగిపోతాయి. రాజశేఖర్-ప్రవీణ్ సత్తారు కలిసి ఒక సీరియస్.. ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ అందించే ప్రయత్నం చేశారు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమాలో చాలా వరకు ప్రేక్షకుడు ఎంగేజ్ అవుతాడు. అక్కడక్కడా కథనం కొంత పక్కదారి పట్టడం.. నెమ్మదించడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా.. ఓవరాల్ గా ‘గరుడవేగ’ మంచి అనుభూతినే కలిగిస్తుంది.

సన్నీ లియోన్ తో ఒక మసాలా పాట.. అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన రెండు మూడు కామెడీ సీన్స్ మినహాయిస్తే.. ‘గరుడవేగ’ ఉత్కంఠ రేకెత్తిస్తూ.. మంచి ఫ్లోతో సాగిపోతుంది. స్క్రీన్ ప్లే సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్. సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఒక పెద్ద స్కామ్ చుట్టూ నడిచే ఈ కథను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చెప్పాడు ప్రవీణ్ సత్తారు. ఇంటర్వెల్ వరకు అసలు కథలోని పాయింట్ చెప్పకుండానే.. చాలా ఆసక్తికరంగా కథను నడిపించడంలో అతను విజయవంతమయ్యాడు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలోని సిబ్బంది ఎలా పని చేస్తారో.. వాళ్ల పరిశోధన తీరు ఎలా ఉంటుందో చూపిస్తూ.. ఒక కేస్ స్టడీని పెట్టి దాని చుట్టూ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.

హీరో ఫ్యామిలీ ఇష్యూను చూపిస్తూ.. కొంచెం సుదర్ఘంగా సాగే ఆరంభ సన్నివేశం కొంచెం సాగతీతగా అనిపించినప్పటికీ.. హీరో మిషన్లోకి దిగాక కథనం రయ్యిన పరుగెడుతుంది. బాంబ్ బ్లాస్ట్ చుట్టూ కుట్రను ఛేదించే క్రమాన్ని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు ప్రవీణ్. ఈ సన్నివేశాలు ప్రపంచ స్థాయి థ్రిల్లర్లను గుర్తుకు తెస్తాయి. బాంబు బ్లాస్ట్ మిషన్ ని బ్రేక్ చేసే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇస్తాయి. ఆడియన్స్ బాగా సినిమాలో లీనమయ్యేది ఇక్కడే. ఇంటర్వెల్ అయ్యేసరికి ‘గరుడవేగ’ మంచి ఫీలింగ్ ఇస్తుంది.

విరామం తర్వాత ‘గరుడవేగ’ కథలోని అసలు పాయింట్ విప్పుతాడు దర్శకుడు. కోర్ కాన్సెప్ట్ ను వివరించే సన్నివేశాలు కొంచెం గందరగోళంగా సాగినప్పటికీ.. ప్రవీణ్ ఈ కాన్సెప్ట్ విషయంలో చాలా స్టడీ చేసిన విషయం అర్థమవుతుంది. అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం ఎగుమతికి సంబంధించి స్కామ్ చుట్టూ నడిచే వ్యవహారంతో ‘గరుడవేగ’లో ఇంటర్నేషనల్ టచ్ కనిపిస్తుంది. ఈ అంశాన్ని కమర్షియల్ సినిమాల్లో మాదిరి పైపైన చూపించకుండా.. వాస్తవికంగా అనిపించేలా.. కొంచెం స్టడీ చేసి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశాడు.

ఐతే ఈ కాన్సెప్ట్ గురించి వివరణ అయ్యాక ‘గరుడవేగ’ కొంచెం ట్రాక్ తప్పుతుంది. కథనం నెమ్మదిస్తుంది. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు కానీ.. అది కూడా కథను కొంచెం పక్కదారి పట్టిస్తుంది. ఇక ఇంత పెద్ద స్కామ్ అనగానే విలన్ గురించి ఎంతో ఊహించుకుంటాం. కానీ ఆ పాత్రలో ఏ విశేషం లేదు. చివర్లో హీరో కుట్రను ఛేదించే క్రమాన్ని కూడా సింపుల్ గా తేల్చేశారు. ద్వితీయార్ధమంతటా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. పతాక సన్నివేశంలో ఉండాల్సినంత ఉత్కంఠ లేకపోయింది. క్లైమాక్స్ సినిమాటిగ్గా సాగిపోతుంది. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఒక కమర్షియల్ సినిమాలో ఎలా అయితే హీరో తేలిగ్గా విలన్ పని పట్టేస్తాడో ఇందులోనూ అలాగే చేయడం నిరాశ పరుస్తుంది. విలన్ హీరోకు సరైన ఛాలెంజ్ ఏమీ విసరడు. అన్నీ హీరోకు అనుకూలంగా సాగిపోతాయి. ఇక్కడ ‘గరుడవేగ’ ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఐతే ఓవరాల్ గా ‘గరుడవేగ’ ఓకే అనిపిస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఎక్కుతుందా అన్నది సందేహే కానీ.. స్పై థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లు కచ్చితంగా చూడదగ్గ సినిమా. రాజశేఖర్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేం. ఇది కచ్చితంగా ఆయనకు కమ్ బ్యాక్ మూవీనే అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

చాన్నాళ్ల తర్వాత వెండి తెరపై కనిపించిన రాజశేఖర్ ను మొదట చూసినపుడు కొంచెం ఇబ్బంది పడతాం. ఆయన లుక్ కొంచెం తేడా కొట్టినట్లుగా అనిపిస్తుంది. కొంతసేపటికి అలవాటు పడతాం. ఐతే పెర్పామెన్స్ పరంగా రాజశేఖర్ అదరగొట్టాడు. సీరియస్ పోలీస్ క్యారెక్టర్లో తనదైన శైలిలో నటించి మెప్పించాడు రాజశేఖర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. హీరోయిన్ పూజా కుమార్ ది లిమిటెడ్ రోల్. ఆమె ఓకే అనిపిస్తుంది. కీలక పాత్రలో ఆదిత్ బాగా చేశాడు. విలన్ కిషోర్ లుక్స్ అవీ బాగున్నాయి కానీ.. అతడి పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. రాజశేఖర్ టీం సభ్యులుగా నాజర్.. రవి వర్మ.. చరణ్ దీప్ ఆకట్టుకుంటారు. పోసాని.. ఆలీ చిన్న చిన్న పాత్రలు చేశారు. వాళ్లు పర్వాలేదు.

రేటింగ్: 3 /5
నటీనటులు: రాజశేఖర్ – పూజా కుమార్ – కిషోర్ – ఆదిత్ – శ్రద్ధా దాస్ – నాజర్ – చరణ్ దీప్ – రవి వర్మ తదితరులు
ఛాయాగ్రహణం: అంజి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల – భీమ్స్
నిర్మాత: కోటేశ్వరరాజు
కథ – మాటలు: ప్రవీణ్ సత్తారు – నిరంజన్ రెడ్డి
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *