చనిపోయిన యువకుడి వీర్యంతో కవలలు జననం

చనిపోయిన ఓ యువకుడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. వినటానికి వింతగా ఉన్నా ఇది మహారాష్ట్రలో జరిగింది. సదరు యువకుడు జీవించి ఉన్నప్పుడు అతడి నుంచి సేకరించిన వీర్యం ద్వారా.. ఇద్దరు పిల్లలు (కవలలు) పుట్టారు. తమ కుమారుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవటం కోసం ఆ యువకుడి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసి ఇది సాధ్యమయ్యింది. ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర నుంచి జర్మనీకి వెళ్లిన 27 ఏళ్ల ప్రథమేశ్‌పాటిల్ 2013లో అనారోగ్యం పాలయ్యారు. ఆయన మెదడులో కణితి ఉందని పరీక్షల్లో వెల్లడయ్యింది. దానిని తొలిగించటానికి అక్కడి వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించారు. అయితే, చికిత్స కారణంగా ప్రథమేశ్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉండటంతో అతడి అనుమతితోనే వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే 2016లో ప్రథమేశ్ మరణించారు. అప్పటికీ ఆయనకు పెండ్లి కూడా కాలేదు. చదువుల్లో గొప్ప ప్రతిభను చూపి, మృత్యుముఖంలో కూడా ధైర్యం కోల్పోని తమ కుమారుడి వంటి మనవలుంటే బాగుండునని భావించిన అతడి తల్లిదండ్రులు.. పుణె-అహ్మద్‌నగర్ రోడ్డులో ఉన్న సహ్యాద్రి దవాఖాన వైద్యులతో చర్చించారు.

జర్మనీలో భద్రపరిచిన ప్రథమేశ్ వీరాన్ని గతేడాది తీసుకొచ్చారు. ప్రథమేశ్ కుటుంబసభ్యుల లక్షణాలతో సరిపోయే ఒక మహిళ నుంచి వైద్యులు అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు. వీటిని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్ తల్లి రాజశ్రీ (49) ముందుకొచ్చినప్పటికీ, గర్భధారణకు ఆమె శరీరం అనుకూలించదని పరీక్షల్లో తేలింది. దీంతో రాజశ్రీ వరుస సోదరి ముందుకు రావటంతో ఆమె గర్భంలో రెండు పిండాలను మే నెలలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆమె ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు మగ పిల్లలకు (కవలలకు) జన్మనిచ్చారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇలాంటి పద్ధతిన పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *