‘రాష్ట్రపతి’గా రామ్‌నాథ్ కోవిందే ఎందుకు?: ఆయన ప్రత్యేకత ఏంటి?

నిన్న మొన్నటి వరకు ఎన్నో పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేశారు. ఎవరూ ఊహించని విధంగా దళిత వర్గానికి చెందిన కోవింద్‌ను ఎంపిక చేయడంతో రాష్ట్రపతి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.

అయితే, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, అట్టడుగు వర్గాల ప్రతినిధిగా పేరుపొందిన రామ్‌నాథ్‌ను పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే, రామ్‌నాథ్ ఎంపికపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మమతా బెనర్జీ అధినేత్రిగా ఉన్న టీఎంసీ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అద్వానీని లేక సుష్మాస్వరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. వామపక్షాల నేతలు మాత్రం ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయంటూ దళిత వర్గానికే చెందినప్పటికీ రామ్‌నాథ్ కోవింద్‌ను వ్యతిరేకించారు. కాగా, బీహార్ సీఎం మాత్రం రామ్‌నాథ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు.

రామ్‌నాథ్ కోవింద్.. సమాజంలోని దళిత, ఆదీవాసీ, మైనార్టీ, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. చేస్తూనే ఉన్నారు. 1997లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని నిబంధనలు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండటంతో దానిపై న్యాయపరమైన పోరాటం చేశారు. చివరకు వాజ్‌పేయి ప్రధానిగా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన సమయంలో వాటిని రద్దు చేయించారు. పేదలకు సంబంధించిన పలుకేసులను ఆయన వాదించి విజయం సాధించారు.

కోవింద్‌ అనేక కీలకమైన పదవులను చేపట్టారు. లక్నోలోని డా. బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ బోర్డులో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. కోల్‌కతాలోని ఐఐఎంలోని బోర్డ్‌ ఆప్‌ గవర్నర్స్‌లో సభ్యునిగా ఉన్నారు. 2002లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రసంగించారు. ఎంపీ హోదాలో థాయ్‌లాండ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, సింగపూర్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, యూకే, యూఎస్‌ఏ, తదితర దేశాల్లో పర్యటించి అక్కడ రాజకీయపరిస్థితులపై అధ్యయనం చేశారు.

రామ్ నాథ్‌కు ఉన్న క్లీన్‌ ఇమేజ్‌.. రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా ఉన్నా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. భారతదేశం గ్రామాల సమూహమని, అన్ని గ్రామాల్లోనూ మౌలికసౌకర్యాలు కల్పించాలని ఆయన ఎప్పుడూ కోరేవారు. ప్రత్యేకించి గ్రామాల్లో విద్యాసౌకర్యాల ఏర్పాటు కోసం ఆయన కృషి చేశారు. కాగా, బీజేపీ స్థాపించిన నాటి నుంచీ పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు రామ్ నాథ్. అంతేగాక, రామ్‌నాథ్‌ కోవింద్‌కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. కీలకమైన దళిత, ఆదీవాసీ సంక్షేమం, హోంశాఖ, పెట్రోలియం, సామాజిక న్యాయం, న్యాయం… తదితర పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *