7,0,1,8,9,8,2,0,2,5,0

బంతి బంతికీ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టగలిగే భీకరమైన బ్యాట్స్‌మన్‌ ఉన్న జట్టు… బరిలోకి దిగడమే ఆలస్యం ఫోర్లు, సిక్సర్లతో అలా అలవోకగా పరుగుల వరద పారించగల హేమాహేమీలు… కానీ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ గట్టిగా నిలబడి రెండు ఓవర్లలో బాదేసే పరుగులు కూడా ఇప్పుడు జట్టంతా కలిసి చేయలేకపోయింది. అటువైపు బౌలింగ్‌ బాగున్నా, పిచ్‌ ఎంత ప్రతికూలంగా మారిపోయినా… బెంగళూరు జట్టు నుంచి మాత్రం ఇంతటి ఘోర ప్రదర్శన ఊహించలేనిది. పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండా ఆర్‌సీబీ మోకరిల్లడం అభిమానులు నివ్వెరపోయేలా చేసింది. సొంత మైదానంలో తక్కువ స్కోరుకే పరిమితమైనా… పరాజయాన్ని అంగీకరించకుండా పట్టుదలగా పోరాడిన కోల్‌కతా అత్యద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నలుగురు పేసర్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగడంతో ఈ ‘నైట్‌’ వారికి చిరస్మరణీయంగా మారిపోయింది.  

కోల్‌కతా: పరుగులు బాదడంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కొత్త కొత్త రికార్డులు నెలకొల్పే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇప్పుడు ఐపీఎల్‌లో అతి చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా పదేళ్ల లీగ్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. కేవలం 9.4 ఓవర్లలోనే బెంగళూరు ఆలౌట్‌ కావడం గమనార్హం. ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. సునీల్‌ నరైన్‌ (17 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరుపై కోల్‌కతా బౌలర్లు చెలరేగిపోయారు. గ్రాండ్‌హోమ్‌ (3/4), వోక్స్‌ (3/6), కూల్టర్‌ నీల్‌ (3/21) రాయల్‌ చాలెంజర్స్‌ పని పట్టారు. కీలక వికెట్లు తీసిన కూల్టర్‌ నీల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

నరైన్‌ ఒక్కడే…
తొలి 33 బంతులు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 65/1. కానీ మిగతా 14 ఓవర్లలో ఆ జట్టు మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోయింది. ఇదీ సంక్షిప్తంగా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ స్వరూపం. ఓపెనర్‌గా కొత్త రూపంలో చెలరేగుతున్న నరైన్‌ ఈసారి కూడా తన బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. అతను మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ కలిసికట్టుగా విఫలం కావడం కేకేఆర్‌ను దెబ్బ తీసింది. బద్రీ వేసిన తొలి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్‌ 4, 4, 4, 6 బాదడంతో జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. అరవింద్‌ వేసిన మూడో ఓవర్లోనూ మూడు ఫోర్లతో జట్టు మొత్తం 14 పరుగులు రాబట్టింది. మరోవైపు గంభీర్‌ (11 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్‌)ను అవుట్‌ చేసి బెంగళూరుకు మిల్స్‌ బ్రేక్‌ ఇచ్చాడు. అయితే రెండు సార్లు ఆర్‌సీబీ అతి సులువైన రనౌట్‌ అవకాశాలు వృథా చేసినా… కోల్‌కతా వాటిని ఉపయోగించుకోలేకపోయింది.

టపటపా…
స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు ఆరంభంలోనే చేతులెత్తేసింది. కూల్టర్‌ నీల్‌ పదునైన బంతులతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే కోహ్లి (0) వెనుదిరగడంతో చాలెంజర్స్‌ షాక్‌కు గురైంది. ఐపీఎల్‌లో కోహ్లి మూడోసారి ‘గోల్డెన్‌ డక్‌’గా (ఆడిన తొలి బంతికి అవుట్‌ కావడం) వెనుదిరిగాడు. రెండో ఓవర్లో మన్‌దీప్‌ (1)ను ఉమేశ్‌ అవుట్‌ చేయగా, తర్వాతి ఓవర్లోనే డివిలియర్స్‌ (8) కూడా సహచరులను అనుసరించాడు. రెండు ఫోర్లు కొట్టి నిలదొక్కుకున్నట్లు కనిపించిన జాదవ్‌ (9) కూడా కూల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లోనే అవుట్‌ కావడంతో బెంగళూరు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. పవర్‌ప్లే ముగిసేవరకు 39/4తో ఉన్న బెంగళూరు వోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ముందుగా గేల్‌ (17 బంతుల్లో 7; 1 ఫోర్‌), ఆ తర్వాత బిన్నీ (9) అవుటయ్యారు. మిగతా నలుగురు అవుట్‌ కావడానికి మరెంతో సమయం పట్టలేదు. దీంతో ఐపీఎల్‌లో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా బెంగళూరు నిలిచింది.

ఆ మ్యాచ్‌…
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు రికార్డు రాజస్థాన్‌ రాయల్స్‌ పేరిట ఉండేది. 2009లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 15.1 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. అనిల్‌ కుంబ్లే (5/5) ధాటికి రాజస్థాన్‌ చేతులెత్తేసింది. అంతకు ముందు 133 పరుగులు చేసిన బెంగళూరు 75 పరుగులతో మ్యాచ్‌ గెలుచుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *