జయలలిత మృతికి అసలు కారణం ఇదే.. అపోలో చైర్మన్

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా ఆమెకు అందిస్తున్న చికిత్సలన్నింటిని తానే దగ్గరుండి మరీ పరిశీలిస్తూ వచ్చాననని, అయితే ఆమె గుండెపోటు వస్తుందని తామెవరమూ ఊహించలేకపోయామని అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్‌ 22న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జయలలిత చికిత్సలకు బాగా స్పందించారని, ప్రతి రోజూ ఆమె తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారని చెప్పారు. జయలలిత సుగుణాలను చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, తలచిన కార్యాన్ని కచ్చితంగా నిర్వర్తించగల సత్తా ఆమెకు మాత్రమే ఉండేదని అన్నారు. అపోలో ఆస్పత్రి ప్రారంభించకమునుపు తాను హెచ్‌ఎం ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు జయలలిత ఓసారి చికిత్స కోసం తన వద్దకు వచ్చారని, అస్వస్థతతో ఉన్నా ఆ సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించిందన్నారు. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు తాను ఆమెను కలుసుకున్నానని, చిరునవ్వుతోనే తనకు స్వాగతం పలికేవారని తెలిపారు.

సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరినప్పటినుంచి జయలలితకు అందించిన చికిత్సలన్నింటిని దగ్గరుండి పరిశీలించానని, నిజానికి రెండు మాసాలపాటు నేను నగరాన్ని విడిచిపెట్టలేదని, తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ ఆమెకు అందించామని ఆయన తెలిపారు. జయలలిత మృతి చెందటానికి కొద్ది రోజులముందు అత్యసవర పనుల మీద హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చిందని, బయలుదేరటానికి ముందు ఆమెను పలకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని, ఆ సమయంలో టీవీ చూస్తున్నారని, తానే దగ్గరగా వెళ్లి ‘హైదరాబాద్‌ నుండి తిరిగొచ్చేలోపున మీరు లేచి నడుస్తారు’ అంటూ చెప్పానని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చాక జయలలితను డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నానని, చెన్నైకి తిరిగొచ్చాక ఆ విషయాన్ని పరిశీలిద్దాంలే ననుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లానని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చాక జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలియగానే తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని పేర్కొన్నారు. హృద్రోగశస్త్ర చికిత్స వైద్యనిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తుండగానే ఆమెకు గుండెపోటు రావడం పట్ల ఆవేదన చెందానని, ఎందుకంటే అప్పటిదాకా ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు అగుపడలేదని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్యనిపుణుల బృందం రంగంలోకి దిగి చికిత్సలు ప్రారంభించిందని, ‘గోల్డెన్ అవర్‌’గా పరిగణించే ఆ సమయంలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామని, ఆమె చికిత్స పొందుతున్న గదికి సమీపంలోనే ‘ఎక్మో’ విభాగపు గది ఉందని, వెంటనే ఆమెకు ఆ పరికరాన్ని అమర్చామని చెప్పారు. ‘ఎక్మో’ చికిత్స చేసుకున్న పలువురు ప్రాణగండం నుంచి బయటపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయని, దురదృష్టవశాత్తూ జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్‌రెడ్డి అన్నారు. జయలలిత చికిత్సలకు బాగా సహకరించారని, అనారోగ్యం సృష్టించిన బాధలన్నింటిని తట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన కీర్తించారు. జయలలిత అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉంటుందని, పార్టీ కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *