సూది మందంటే నాకు మహా భయం – కేసీఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ దీక్షతో తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అతిచిన్న ప్రక్రియ అయిన కంటి ఆపరేషన్‌ను పదే పదే వాయిదా పడటానికి గల కారణం తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. కేసీఆర్‌ కుడి కంటికి శుక్లం రావడంతో దాన్ని తొలగించడానికి చిన్నపాటి లేజర్‌ ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. మొదట కొంత అనాసక్తి ప్రదర్శించిన కేసీఆర్‌.. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఆపరేషన్‌కు సరేనన్నారు. కుటుంబ సమేతంగా ఇదే పనిపై రెండుసార్లు ఢిల్లీకి వచ్చిన ఆయన ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. కంటి ఆపరేషన్‌ కోసం గత మే నెలలో ఒకసారి ఢిల్లీకి వచ్చినప్పుడు వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు.

అప్పుడు అమెరికా నుంచి రావాల్సిన డాక్టర్‌ సకాలంలో రాలేదు. మరోసారి వచ్చి ఆపరేషన్‌ చేయించుకుంటానంటూ కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, ఆపరేషన్‌ కోసం ఢిల్లీకి రావాలని ఆసుపత్రి వర్గాలు కేసీఆర్‌కు సమాచారం పంపాయి. మళ్లీ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు గత నెల కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చారు. వెంటనే డాక్టర్లు ఆయన ఇంటికి వచ్చి కంట్లో చుక్కల మందు వేశారు. ఆపరేషన్‌కు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి కోవింద్‌ నామినేషన్‌ తరువాత ఆపరేషన్‌ చేయించుకుంటానని చెప్పి వాయిదా వేశారు.

నామినేషన్‌ అయిన తరువాత ఆయన వద్దకు వచ్చిన డాక్టర్లకు కేసీఆర్‌ మరో కారణం చెప్పారు. అపరేషన్‌ చేయించుకుంటే కనీసం వారం రోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, కోవింద్‌ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వస్తున్నందున ఆయన కన్నా ముందే అక్కడ ఉండాల్సిన అవసరం ఉందంటూ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మళ్లీ వారందరినీ హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసీఆర్‌ కంటి ఆపరేషన్‌ వాయిదాకు అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఈ కారణాలను ఆయనే స్వయంగా తన పార్టీ ఎంపీల ఇష్టాగోష్ఠిలో చెప్పారు.

తనకు సూది మందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పడంతో ఎంపీలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ‘‘తెలంగాణ తెచ్చిన వీరాధివీరులు మీరు. ఎన్నో రాజకీయ కుట్రలను ఎదుర్కొన్నారు. వేటికీ భయపడని మీరు.. ఒక్క సూది మందుకు భయపడతరా సారూ! చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో సూదిమందుకు భయపడటం లేదు.. మీరేంది సారూ?’’ అని ఎంపీలు ప్రశ్నించారట. ‘‘ఈ విషయం ఎవరితో గట్టిగా చెప్పకండి. మా ఇంట్లో వాళ్లకుకూడా తెలియదు. మీరు చెబితే బలవంతంగా ఆపరేషన్‌ చేయిస్తారు’’ అని కేసీఆర్‌ బదులివ్వడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *