జియోకు పోటీ: ఎయిర్‌సెల్‌ బంపర్‌ ఆఫర్‌

రెండు రోజుల క్రితమే రిలయన్స్‌ జియో తన కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. అప్పుడే ప్రత్యర్థుల నుంచి కౌంటర్‌ అటాక్‌ ప్రారంభమైంది. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి జియో కొత్త ప్లాన్‌ రూ.399కు పోటీగా తమ ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌సెల్‌ తమ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌ రూ.348ను తమ యూజర్లకు అందిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్‌ సెల్‌ తాజాగా ప్రకటించిన ఈ ప్యాక్‌, ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది.  జియో యూజర్లు కూడా తమ కొత్త ప్లాన్‌ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా,  అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవడానికి వీలుంది.
ఎయిర్‌సెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్యాక్‌ ఎఫ్‌ఆర్‌సీ 348 ప్రస్తుతం ఉత్తర యూపీలో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. ఈ ప్యాక్‌ కింద యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్‌(లోకల్‌, ఎస్‌టీడీ) చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్‌ స్పీడు 3జీ మాత్రమే. అదే రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌పై అయితే 4జీ స్పీడును పొందవచ్చు. ఈ ప్యాక్‌ గురించి యూపీ(ఈస్ట్‌) సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ గుప్తా మాట్లాడుతూ.. ”ఎఫ్‌ఆర్‌సీ 348 మార్కెట్లో ఇప్పటివరకున్న ఉత్తమమైన విలువ. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్‌సెట్ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్‌ అయిపోతుందనే బాధ అవసరం లేకుండా వీడియో చాటింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, వీడియోల స్ట్రీమింగ్‌, వాయిస్‌ కాల్స్‌ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ ప్యాక్‌ను డిజైన్‌ చేసినట్టు చెప్పారు.
కాగ, రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్ల నుంచి టారిఫ్‌ ప్లాన్లు అమలు చేయడం, ఆ తర్వాత ప్లాన్ల రేట్లను పెంచడం టెలికాం ఇండస్ట్రీకి సానుకూలంగా మారుతుందని విశ్లేషకులంటున్నారు. ప్రత్యర్థులు కూడా జియో రేట్లకు అనుగుణంగా తమ టారిఫ్‌ ప్లాన్లను పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతోందని చెప్పారు.. ఇన్నిరోజులు జియో దెబ్బకు ప్రత్యర్థులు హడలిపోయిన సంగతి తెలిసిందే.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *