కేసీఆర్ గబ్బర్ సింగ్ లాంటోడు అంటున్న: రేవంత్

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కొత్త విమర్శలు చేశారు. అసెంబ్లీ లో వాస్తవాలు మాట్లాడటానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. పోలే సినిమాలో గబ్బర్ సింగ్ తరహాలో సీఎం కేసీఆర్ తన చుట్టూ ఉన్న వారిని చూసి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు రెండు – మూడు నిమిషాలకు మించి అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్న తీరును  ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకే కాకుండా ఆయా శాఖల మంత్రులకు కూడ సంబంధిత శాఖపై చర్చ జరిగినప్పుడు కూడ కేసీఆర్ కుటుంబీకులు మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.

అసెంబ్లీ లో త్రీ మ్యాన్ షో నడుస్తోందని రేవంత్ ఆక్షేపించారు. కేసీఆర్ – కేటీఆర్ – హరీశ్ రావులే ముఖ్యమైన అన్ని అంశాలపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరితహారం గురించి మంత్రి జోగు రామన్న మాట్లాడాల్సి ఉండగా ఆయనకు బదులుగా సీఎం కేసీఆర్ మాట్లాడారని – భూసేకరణ బిల్లుపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ మాట్లాడాల్సి ఉండగా ఆయనకు బదులు హరీశ్ రావు మాట్లాడరని చెప్పారు. అలాగే రోడ్లు – వంతెనలపై సంబంధిత మంత్రి తుమ్మల మాట్లాడాల్సి ఉండగా ఆయనను పక్కనపెట్టి కేసీఆర్ మాట్లాడగా…మిషన్ భగీరథపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడాల్సి ఉండగా కేటీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి వివరించారు. మంత్రులకు ఏం మాట్లాడలన్న సోయి లేదని సిఎం ఆయన కుటుంబీకులే మాట్లాడుతున్నారా అని రేవంత్ నిలదీశారు. సభను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు – మంత్రులకు కూడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలుగా ప్రజల వాణిని వినిపించటానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వం ఆఖరుకు మంత్రులకు కూడ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి  విమర్మించారు. మంత్రులకు సోయి లేదని సీఎం అనుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో గడిచిన రెండేళ్ళ కాలంలో 2256 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  వెల్లడించిన నేపధ్యంలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అతి తక్కువ పరిహారాన్ని ఇచ్చారని రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని కేసీఆర్ గతంలో అనేక సార్లు చెప్పారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు టీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై మాత్రం నోరుమొదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై విపక్షాలు గొరంతను కొండంతను చేస్తున్నాయని సీఎం విమర్పించేవారని అయితే ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారికంగా రైతు ఆత్మహత్యలలో తెలంగాణ గత రెండెళ్ళుగా దేశ స్థాయిలో రెండవ స్థానంలో ఉందని నిర్ధారించడంపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. 2014 లో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 2015 లో 1358 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని NCRB వెల్లడించిందని దీనికి సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతు ఆత్మహత్యలు ఉండవని బంగారు తెలంగాణ ఏర్పడుతుందని నమ్మించిన కేసీఆర్ బంగారు తెలంగాణను బొందలగడ్డ తెలంగాణగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల పరిహారాన్ని తక్షణమే అందించాలని రేవంత్ డిమాండ్ చేశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కోరారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *