తాగి కారు నడిపితేనే జైలులో..తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను జైల్లో పెట్టొద్దా: రేవంత్

హైదరాబాద్: తాగి కారు నడిపితేనే జైలులో పెడుతున్నారని, మరి, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎందుకు జైలులో పెట్టరని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ఆయనను అండమాన్ జైలులో పెట్టాలన్నారు. కేసీఆర్‌ను జైలులో పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా? చెప్పాలన్నారు. తెలంగాణ టిడిపి పోరుయాత్ర బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాగిన మత్తులో రాత్రికి ఒక నిర్ణయం, మరుసటి రోజు తెల్లవారుజామున మరో నిర్ణయం తీసుకుంటున్న వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చురుకైన నాయకత్వం, సామాజిక న్యాయం చేయగలిగిన పార్టీ కావాలన్నారు.

పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం కావాలని, అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం లేదన్నారు. నకిలీ ఉద్యమకారులందరిని తెలంగాణలో మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, కేంద్రం ఇచ్చిన రూ.790 కోట్ల ఇన్‌పుట్ సబ్బిడీ రూపాయి కూడా రైతుకు అందలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదని, కనీసం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. తెరాస పైన తెలంగాణ టిడిపి యుద్ధం ప్రకటించిందన్నారు. ఎవరి వైపు ఉండాలో తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటుందన్నరు. తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్‌ను ఇన్నాళ్లు భరించామని, ఇక భరిస్తే మనకంటే అమాయకులు మరొకరు ఉండరని చెప్పారు. తెలంగాణకు ప్రమాదం అంచున నడుస్తోందన్నారు. లక్ష కోట్లకు పైగా అప్పు తెచ్చి పేదవాడి పైన భారం మోపుతున్నారన్నారు. 16 మంది సీఎంలు తెచ్చిన అప్పు కంటే రెండేళ్లలో తెచ్చిన అప్పే ఎక్కువ అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *