పనికిమాలిన పార్లమెంట్‌ సభ్యులు

వాళ్లిద్దరు వారి వారి రంగాల్లో అగ్రగణ్యులే.. ఒకరు క్రికెట్‌ రంగానికే దేవుడు.. మరొకరు బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌.. ఇద్దరు తమ రంగాల్లో ప్రతిభాపాటవాలతో కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వారే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. రేఖా ఈ ఇద్దరు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. అయితే వీరు వృత్తిపరంగా తమ రంగాల్లో మేటీలే కానీ ప్రజాప్రతినిధులుగా వారి పనితీరు మాత్రం అధ్వానంగా ఉంది. వాళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! సచిన్‌ టెండూల్కర్, రేఖ ఇద్దరూ 2012 మార్చిలో పెద్దల సభలో అడుగు పెట్టారు. వీరు రాజ్యసభకు ఎన్నికై ఆరేళ్లవుతోంది. ఈ ఇద్దరు ఈ నెలాఖరుకి పదవి విరమణ చేయబోతున్నారు. అయితే ఈ ఆరేళ్లలో వీరు రాజ్యసభకు హాజరైన వివరాలను రాజ్యసభ వెల్లడించింది.

ఆ వివరాలను బట్టి చూస్తే సచిన్‌ ఆరేళ్లలో 7.3 శాతం మాత్రమే హాజరయ్యారు. అంటే సచిన్‌ రాజ్యసభకు హాజరైంది కేవలం 23 రోజులే అన్నమాట. ఈ 23 రోజులు రాజ్యసభకు హాజరైనందుకు గాను ఆయన తీసుకున్న జీతం అక్షరాల 59 లక్షలు. ఈ ఆరేళ్లలో ఆయన కేవలం 22 ప్రశ్నలను మాత్రమే అడిగారు. అంతే కాకుండా సచిన్‌ రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇక రేఖ సచిన్‌ కంటే దిగువనే ఉంది. ఆమె ఈ ఆరేళ్లలో కేవలం 4.5 శాతం మాత్రమే రాజ్యసభకు హాజరైంది. ఆమె రాజ్యసభకు హాజరైంది కేవలం 18 రోజులు మాత్రమే.. ఆమె రాజ్యసభలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క సెషన్‌ ను తీసుకున్నా ఆమె ఒక్క రోజుకు మించి సభకు హాజరు కాలేదు. అంతే కాకుండా ఆమె పెద్దల సభలో ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపలేదు. 18 రోజులు రాజ్యసభకు హాజరైనందుకు రేఖ తీసుకున్న జీతం అక్షరాల 65 లక్షలు తీసుకుంది.

సచిన్‌, రేఖలు తమ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్దరి పనితీరుపై ఇప్పుడు సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీలకు రాజకీయ పదవులెందుకన్న చర్చ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. సాధారణంగా సామాన్య ఉద్యోగి సచిన్‌, రేఖ లాగా ఇష్టమొచ్చినట్టు ఉద్యోగానికి పోతే వారి ఉద్యోగం ఊడుతుంది. మరి ప్రజాప్రతినిధులు ఇష్టమొచ్చినట్టు చట్టసభలకు వెళ్లవచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సేవకు పాటుపడుతూ చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తాలే కానీ సభలకు హాజరుకాకుండా ఉండడమేంటనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *