ఆగ్రహంతో రగిలిపోతున్న శశికళ!

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం. శశికళ పదవి ఉండేనా ఊడేనా అనే చర్చతో అన్నాడీఎంకేలోని ఇరువర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి సారథ్యం వహిస్తున్న పన్నీర్‌సెల్వం తన వర్గ ఎంపీల ద్వారా శశికళ ఎంపికపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.

ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యత్వంలేని శశికళ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హురాలు కాదని పన్నీర్‌వర్గం వాదించింది. దీంతో ఆమెను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని శశికళ వర్గీయులు సమర్థించుకున్నారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే విధానమే లేదు, పార్టీ నియమావళిని సవరించే హక్కు ఎవరికీ లేదని పన్నీర్‌ వర్గం వాదించింది. ఇదే వాదనను సీఈసీ ముందుంచి శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని ఫిర్యాదు చేసింది.

పన్నీర్‌ ఇచ్చిన ఫిర్యాదుకు బదులివ్వాల్సిందిగా సీఈసీ శశికళకు నోటీసులు జారీచేసింది. అయితే శశికళకు బదులుగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ బదులిచ్చారు. దినకరన్‌ ఇచ్చిన వివరణను స్వీకరించేందుకు నిరాకరించిన సీఈసీ శశికళ నుంచి జవాబును రాబట్టింది. శశికళ ఇచ్చిన జవాబుపై పన్నీర్‌సెల్వం మరోసారి సీఈసీకి వివరణ ఇచ్చారు. పన్నీర్‌సెల్వం వివరణను శశికళ మరోసారి ఖండిస్తూ సీఈసీకి లేఖ రాసింది. ఇలా సీఈసీ కేంద్రంగా ఇరు వర్గాల మధ్య సుమారు నెలరోజులపాటు ఉత్తరాల పరంపర సాగి రెండు రోజుల క్రితం ముగిసింది.

24లోగా తీర్పు:

ఇరుపక్షాల వాదనలపై సీఈసీ అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అభ్యర్థులకు ఈనెల 24వ తేదీలోగా బీఫారం అందజేయాల్సి ఉంటుంది. బీఫారం అందజేసిన వారికి ఎన్నికల కమిషన్‌ ఎన్నికల చిహ్నాన్ని కేటాయిస్తుంది. అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులు తమదేనంటూ శశికళ, పన్నీర్‌వర్గాలు వాదించుకుంటున్నాయి. అర్కేనగర్‌ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈనెల 20వ తేదీన సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం వర్గీయుడైన పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, శశికళను అనర్హురాలిగా ప్రకటించడం, రెండాకుల చిహ్నం తమకు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలమైన ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సీఈసీకి అందజేసినందున తమకే దక్కుతుందని విశ్వాసం ఉన్నట్లు చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి విధానమే లేనపుడు శశికళ ఎంపిక ఎలా చెల్లుతుందని ఆయన అన్నారు. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించగానే ఆమె చేసిన నియామకాలు రద్దు కాగలవు, పార్టీ తమ చేతుల్లోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అగ్రహార జైలులో శశికళ ఆగ్రహం:

బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి  నెలరోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతో ఉన్నారు. నెలరోజుల్లో మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్‌ కామరాజ్‌  శశికళను చూసి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ బెంగళూరులో కలిశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు కొన్ని రోజులుగా ఎవ్వరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ ఆసంతృప్తితో రగిలిపోతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *