సౌదీ అమ్మాయిలకు ఇక ప్రయాణ స్వేచ్ఛ

సౌదీ అరేబియాలో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ దేశంలో మహిళలకు కఠిన నిబంధనలు ఉంటాయి. గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం.. అక్కడి మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత కొన్నిరోజులుగా ఈ గార్డియన్‌షిప్‌ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. దానిలో బాగంగానే తాజాగా సౌదీ మహిళలకు ‘ప్రయాణ స్వేచ్ఛ’ లభించింది. 21ఏళ్లు పైబడిన మహిళలు ఇకపై తమ ఇంట్లోని పురుషుల అనుమతి లేకుండానే పాస్‌పోర్టు తీసుకోవచ్చు. విదేశాలకు కూడా వెళ్లొచ్చు. ఈ సంస్కరణలను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు ఆరంభంలో ఈ సంస్కరణలను సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి వాటిని అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్‌పోర్టు విభాగం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మహిళ ప్రగతి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. పురుషులతో సమానంగా వారికి హక్కులు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. దీన్నిబట్టి సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో మహిళల పట్ల వివక్ష తగ్గుతోందాని చెప్పొచ్చు. కానీ కొందరు సంప్రదాయవాదులు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్ధమంటూ విమర్శలు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *