తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో తమ వాదనలు వినాలంటూ తెలంగాణ దాఖలు చేసిన పిటిషనపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ మోహన ఎం.శంతన గౌండర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అయితే, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మినహా మిగతా ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు మహారాష్ట్ర, మరొకరు కర్నాటకలకు చెందిన వారని, వారు ఈ కేసులో వాదనలు వినకూడదని తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ కోరారు. కాగా, గతంలో పంజాబ్‌, హర్యానా కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఆయా రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు కూడా ఉన్నారని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రస్తావించారు. వైద్యనాథన స్పందిస్తూ.. సదరు కేసు కాల్వకు సంబంధించినదని, ఇది నదీ వివాదాలకు సంబంధించినదని చెప్పారు. దీనిపై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీవ్రంగా స్పందించారు.

‘మేమేం చేయాలో మీరు చెప్పకూడదు. మీరు చెప్పింది మేం చేసే తీరాలన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ కేసులో వాదనలు మేం వింటాం’ అని స్పష్టం న్యాయమూర్తి చేశారు. జాబితాలోని మిగతా కేసులన్నీ ముగిసిన తర్వాతవింటామని చెప్పి, మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి విచారణను చేపట్టగా.. ‘మీరు అలా చెప్పకుండా ఉండాల్సింది’ అని వైద్యనాథన్‌ను ఉద్దేశించి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నారు.

కర్ణాటక న్యాయవాది ఫాలీ నారీమన్‌ స్పందిస్తూ.. ‘మీకు అధికారం లేదని కోర్టుకు ఎప్పుడూ చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చెబితే ఆ మాట ఎక్కడుందో చూపించమని కోర్టు అడుగుతుంది’ అంటూ ఒక ప్రఖ్యాత న్యాయమూర్తి గతంలో పేర్కొన్నారని తెలిపారు. జస్టిస్‌ ఖన్విల్కర్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలు ఈ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని, తెలంగాణ వాదన ప్రకారం వారెవ్వరూ ఇందులో భాగం కాకుండా చూడాల్సి వస్తుందని చెప్పారు. విచారణలో భాగస్వాములం కాబోమని జస్టిస్‌ఖన్విల్కర్‌, జస్టిస్‌ గౌండర్‌ తెలుపగా.. వారిద్దరూ భాగం కాని ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు సూచిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *