షాక్: ప్రెస్ నుంచి నేరుగా శేఖర్‌రెడ్డి ఇంటికి రూ.2000 కొత్త నోట్లు!

చెన్నై: భారీ ఎత్తున నగదు, బంగారంతో పట్టుబడిన మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డికి బ్యాంకుల నుంచి కాకుండా ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా అందినట్లు సమాచారం. ఈ మేరకు అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

శేఖర్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలతోపాటు ఆయన బంధువుల నివాసాల్లోకూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించి, ఇప్పటివరకు రూ.131కోట్ల నగదు, 170కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.34కోట్ల వరకు కొత్త రూ.2వేల నోట్లే ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులు శేఖర్‌రెడ్డి వద్ద లభ్యమైన రూ.2వేల నోట్ల సీరియల్‌ నెంబర్ల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఆ ప్రకారం ముద్రణాలయం నుంచే శేఖర్‌రెడ్డికి పెద్దమొత్తంలో కొత్త నోట్లు చేరినట్లుగా భావిస్తున్నారు.

సాధారణంగా కొత్తనోట్లు ముద్రణాలయం నుంచి రిజర్వ్‌బ్యాంకుకి, అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్తాయి. కానీ స్టేట్‌ బ్యాంకుకు చెందిన కొన్ని పాలన కార్యాలయాలకు నేరుగానే కొత్త నోట్లు వచ్చాయి. ఇలా వచ్చిన కొత్త రూ.2వేల నోట్లే శేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్టేట్‌ బ్యాంకుకు చెందిన పది మంది ఉన్నతాధికారులను విచారిస్తున్న ఐటీ అధికారులు, త్వరలోనే వారినీ అరెస్టు చేయనున్నట్లు సమాచారం.

కాగా, సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంకుకు అక్కడి నుంచి ఇతర బ్యాంకులకు నోట్లు పంపిణీ జరగాలి. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఏపీ, తెలంగాణలోని ఎస్‌బీఐ ప్రత్యేక శాఖ(స్కేప్)లకు పంపారు. స్కేప్‌గా పిలిచే ఈ శాఖలు ఏపీలో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇలాంటి శాఖలకు వచ్చిన కొత్త కరెన్సీని యథాతథంగా శేఖర్ రెడ్డికి బదలాయించడం సంచలనంగా మారింది. ఐటీ అధికారుల విచారణ పూర్తయితే గానీ ఏ శాఖల నుంచి శేఖర్ రెడ్డి ఇంటికి నగదు వెళ్లిందనే విషయం వెలుగుచూస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *