దాదా గెలిచాడు…ఇంగ్లాండ్ జెర్సీ ధరిస్తా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కట్టిన పందెంలో ఓడిపోయినందుకు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఇంగ్లాండ్ జెర్సీ వేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేన్ వార్న్ అభిమానులతో పంచుకున్నాడు.

ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై వేసుకున్న పందెంలో గంగూలీ నువ్వే గెలిచావు. త్వరలో ఇంగ్లాండ్‌ జెర్సీని రోజంతా ధరిస్తాను అని పేర్కొన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ధరించే వన్డే జెర్సీని అందజేయమని స్వయంగా గంగూలీనే వార్న్‌ అడిగాడు. జెర్సీని పంపిస్తే పందెంలో భాగంగా ధరించి ట్విటర్‌ ద్వారా ఫొటోను పంచుకుంటాను అని వార్న్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై ఇద్దరు మాజీ క్రికెటర్లు పందెం వేసుకున్నారు. లండన్‌లో నిర్వహించిన ఓ టీవీ కార్యక్రమంలో భారత్‌కు చెందిన సౌరవ్‌ గంగూలీ, ఆసీస్‌కు చెందిన షేన్‌ వార్న్‌ పాల్గొన్నారు. మాటల మధ్యలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తోందని గంగూలీ అనగా… వెంటనే షేన్‌వార్న్‌ ఆసీస్‌ గెలుస్తోందని అన్నాడు. దీంతో ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఎవరు ఓడిపోతే వారు గెలిచిన వారికి విందు ఇవ్వాలని. అయితే షేన్‌ వార్న్‌ ఒకడుగు ముందుకేసి ఆసీస్‌ గెలిస్తే గంగూలీ ఆ జట్టు జెర్సీ ధరించాలని.. ఇంగ్లాండ్‌ గెలిస్తే తాను ఆ జట్టు జెర్సీ ధరిస్తానని అన్నాడు. దీనికి ఇద్దరూ ఓకే అనుకున్నారు. టోర్నీలో భాగంగా జూన్‌ 10న ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ 40పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో స్పందించిన వార్న్ తన ఓటమిని అంగీకరించాడు.

ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలవ్వడంతో ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆసీస్‌ కథ ముగిసింది. గ్రూప్‌-ఎ నుంచి ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ సెమీస్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *