పన్నీర్ సెల్వం ఇప్పుడు జీరో కాదు.. హీరో

పన్నీర్ సెల్వం.. అమ్మ జయలలిత ఉన్నంత కాలం అపర విధేయుడు. ఆ తరువాత చిన్నమ్మ శశికళ మాటనూ జవదాటకుండా అంతే విధేయత ప్రదర్శించారు. అంతేకాదు… శశి కోసం ఏకంగా రాజీనామా చేసిన త్యాగమూర్తి. 2001 నుంచి పలు మార్లు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి పీఠమెక్కినా అంతా అమ్మ చలవతోనే. అమ్మ కూర్చోమంటే కూర్చోవడం.. దిగిపోమంటే దిగిపోవడం. సొంతంగా వర్గాన్ని ఏర్పరుచుకోలేదు. ఒక్కసారి సీఎం సీట్లో కూర్చున్నాను కదా అని కబ్జా చేసే ప్రయత్నమూ చేయలేదు. దాంతో పన్నీర్ సెల్వం అంటే త్యాగమూర్తి అన్న ఇమేజి స్థిరపడిపోయింది. జోకర్.. అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలియని పిచ్చోడు.. వెన్నెముక లేనోడు వంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పన్నీరు ఇమేజి రాత్రికి రాత్రి  మారిపోయింది.  ముందు రోజు రాజీనామా చేసిన పన్నీరే మరునాడు అడ్డం తిరగడం.. ఆ సందర్భంగా ఆయన చేసిన ఉద్వేగ భరితమైన ప్రసంగం దెబ్బకు జీరో అన్నవారే ఇప్పుడు ఆయన్ను హీరో అంటున్నారు.

నిజానికి మొన్న పన్నీర్ సెల్వం చాలా సింపుల్ గా శశికళ పేరును సీఎం పదవికి ప్రతిపాదించి పార్టీలో ఆమె ఎన్నికయ్యేలా చేస్తూ తాను స్వయంగా రాజీనామా చేయడంతో సోషల్ మీడియాలో ఆయన్ను ఏకిపడేశారు. ఓ పన్నీర్ సెల్వం అన్న పేరులో మొదటి అక్షరం ‘ఓ’ ను సున్నాగా గుర్తించి జీరో పన్నీర్ సెల్వం అంటూ ఏకి పడేశారు.

అయితే.. ఇదంతా ఒక్క రోజులో మారిపోయింది. మంగళవారం రాత్రి ఆయన చేసిన ప్రసంగం మొత్తం మార్చేసింది. జయలలిత సమాధి సాక్షిగా పన్నీర్ రేపిన అలజడి తమిళనాడును కదిలించేసింది. 20 నిమిషాల పాటు ఆయన చేసిన ప్రసంగంతో ఒక్కసారిగా ఆయన జననేత అయిపోయారు. అమ్మకు వారసుడు పన్నీరేనని జనం నినదించేలా హీరోగా మారిపోయారు.  అమ్మకు ఆయనే ప్రతినిధి అన్న భావన తమిళనాట బలంగా వినిపిస్తోంది. మరి.. పన్నీర్ గతం మాదిరిగా అవకాశాలను వదులుకుంటారో లేదంటే వినియోగించుకుంటారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *