వాళ్ళని కండోమ్స్ లాగ వాడుకొంటున్నారుట!

కొన్ని పోలికలు వాస్తవపరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించవచ్చు లేదా సదరు వక్త మనసులో ఆలోచనలకు అద్దం పట్టేవిగా ఉండవచ్చు కానీ అవే ఒక్కోసారి ప్రతికూలంగా మారి వ్యతిరేక అభిప్రాయం కూడా కలిగిస్తుంటాయి.

మహారాష్ట్రలోని సమాజ్ వాదీ అధ్యక్షుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీ దేశంలో ముస్లింల పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు ఆవిధంగానే ఉన్నాయి. ముంబైలో నిన్న జరిగిన గ్రేటర్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ ముస్లింలను కండోమ్స్ లాగ వాడుకొంటున్నాయని ఫర్హాన్ అజ్మీ అన్నారు. రాజకీయ పార్టీలన్నీ అధికారంలోకి రావడం కోసం ముస్లింలను ఓటు బ్యాంకులుగా మాత్రమే భావిస్తున్నాయి తప్ప వారి బాగోగులు పట్టించుకోవడం లేదని చెప్పడం ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కానీ ఆ వ్యాఖ్యలకు ప్రత్యర్ధ పార్టీలు వేరే బాష్యం చెప్పాయి.

ముస్లింల పట్ల సమాజ్ వాదీ పార్టీకి ఎంత చులకన భావం ఉందో తెలుసుకోనేందుకు ఆ వ్యాఖ్యలు ఒక నిదర్శనం అని ఆ ఎన్నికలలో పోటీ పడుతున్న మజ్లీస్ పార్టీ అంటే, ముస్లింలను కండోమ్స్ తో పోల్చడం ద్వారా యావత్ ముస్లింలను అవమానించారని భాజపా విమర్శలు గుప్పించింది. కానీ వాస్తవానికి మజ్లీస్ పార్టీతో సహా ఏ పార్టీకి కూడా ముస్లింలపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు, వారి సంక్షేమం కోసం తపన లేవనే సంగతి అందరికీ తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ముస్లింల ఓట్లు రాబట్టుకోవడానికే ఎన్నికల సమయంలో ముస్లింల గురించి బాధపడుతూ మొసలి కన్నీళ్ళు కార్చుతుంటాయని వారికీ తెలుసు.

ముస్లింల ఓట్లు పడతాయనే నమ్మకంతోనే మజ్లీస్ వంటి పార్టీలు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి మాత్రమే ఎందుకు పోటీ చేస్తుంటాయి? అంటే అందుకే అని అర్ధం అవుతుంది. మిగిలిన పార్టీలు కూడా అక్కడ ముస్లిం అభ్యర్ధులనే నిలబెట్టి వారి ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్క ముస్లింల విషయంలోనే కాదు కులాలు, మతాలు, ప్రాంతాలు, బాషలు, సెంటిమెంట్లు ఇలా రకరకాల సమీకరణాలతో ఎక్కడ ఏ వర్గం జనాభా ఉంటే ఆ వర్గానికే చెందిన వారిని అభ్యర్ధులుగా నిలబెడుతుంటాయి. కనుక ఒకటి మంచిది మరొకటి చెడ్డది అనుకోవడానికి లేదు. అన్ని పార్టీలు ఆ తానులో ముక్కలే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *