ట్రైలర్: మహేశ్ బాబు స్పైడర్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ప్రిన్స్ మహేశ్ బాబు మరుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి సమయంలో విడుదలైన ఈ ట్రైలర్ 1మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది. ఇవాళ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్పైడర్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. అందరూ ఈరోజు సాయంత్రం ట్రైలర్ విడుదలవుతుందని భావించారు. కానీ, స్పైడర్ ట్రైలర్ అనుకున్న సమయం కంటే ముందే విడుదల కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ ట్రైలర్ నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే వాయిస్ ఓవర్‌తో మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక నిమిషం 52సెకన్ల నిడివిలో స్పైడర్ టీజర్ కనువిందు చేసింది. టీజర్లో, సాంగ్స్ ప్రోమోల్లో ఉన్న కొన్ని సీన్లు ట్రైలర్లో కూడా రిపీట్ కావడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్‌ను గమనిస్తే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని స్పష్టమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరో క్యాచీ సాంగ్‌ను స్పైడర్ బోనస్ ట్రాక్ పేరుతో నెట్లో పెట్టారు. గీతామాధురి పాడిన ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. స్పైడర్ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది.