నేనేమైనా వెధవనా?: శ్రీశాంత్

తిరువనంతపురం: తనను స్కాట్లాండ్ క్రికెట్ లీగ్ లో ఆడకుండా అడ్డుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ బౌలర్ శ్రీశాంత్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అసలు తన జీవితకాల నిషేధంపై ఎటువంటి అధికారికి పత్రం ఇవ్వని బీసీసీఐ.. ఏ రకంగా తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటుందని శ్రీశాంత్ విమర్శించాడు. అసలు తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకునే అధికారం బీసీసీఐకి లేదని శ్రీశాంత్ మండిపడ్డాడు.

‘నా జీవిత కాల నిషేధంపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక లేఖ లేదు. మరి అటువంటప్పుడు నన్ను ఆడొద్దని అంపైర్లు ఎలా అడ్డుకుంటారు. ఫిక్సింగ్ ఆరోపణలపై నేను తిహార్ జైలుకు వెళ్లినప్పుడు కేవలం సస్పెన్షన్ లెటర్ మాత్రమే ఇచ్చారు. ఆ సస్పెన్షన్ లెటర్ కూడా 90 రోజుల పాటు మాత్రమే చెల్లుతుంది. నాపై జీవితకాల నిషేధం  విధిస్తూ మీడియాకు మాత్రమే బీసీసీఐ చెప్పింది. ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎటువంటి అధికారిక లేఖ ఇవ్వలేదు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడకుండా ఉండటానికి నేను ఏమైనా వెధవనా?, నా పట్ల బీసీసీఐ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఉగ్రవాది తరహాలో నన్ను చూస్తుంది’ అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలో ఎర్నాకుళం క్రికెట్ క్లబ్ తరపున రెండు రోజుల గేమ్ ను ఆడనున్నట్లు శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపాడు.  ఇటీవల స్కాట్లాండ్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాలనుకున్న ఈ కేరళ స్పీడ్‌స్టర్‌కు నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది.

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్‌చిట్‌ లభించించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *