తారక్ సినిమాలో అతిలోక సుందరి…

‘జనత గ్యారేజ్’ రిలీజ్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు పెట్టనే లేదు. వరస హిట్లతో ఊపు మీదున్న తారక్ ఈ సారి మాత్రం తొందర పడకుండా ఆచితూచి అడుగు వేస్తున్నాడు. పక్క హీరోతో హిట్ కొట్టిన దర్శకుల వెంటపడటం అనే సంప్రదాయంతో ఇంత వరకు ఎన్నో దెబ్బలు తిన్న తారక్ ఫైనల్ గా దానికి గుడ్ బై చెప్పేసాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ తో డిస్టర్బ్ అయిన బాబీని తన కొత్త సినిమాకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చేసాడు. ముందు సినిమా రికార్డు చూసుకోవడం కంటే ఆ దర్శకుడు చెప్పిన కథలో విషయం ఉందా లేదా అనే దాని మీదే ఫోకస్ చేసాడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మించబోయే ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు అనే న్యూస్ ఇప్పటికే నందమూరి ఫాన్స్ ని థ్రిల్ చేసింది. ముగ్గురు హీరొయిన్ల కోసం దర్శకుడు బాబీ వేటలో ఉండటం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

ఇప్పుడు దీనికి మరో అట్రాక్షన్ కూడా జత కాబోతోంది. అలనాటి అందాల సుందరి శ్రీదేవిని ఇందులో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారని వార్త. కథలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఈ రోల్ తనకైతేనే పర్ఫెక్ట్ అని ఫీల్ అవ్వడంతో అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. శ్రీదేవి తారక్ తాతయ్య ఎన్టీఆర్ తో ‘వేటగాడు’, ‘బొబ్బిలి పులి’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తన తండ్రికి జోడిగా నటించింది అనే కారణంతో బాలకృష్ణ మాత్రం శ్రీదేవి జంటగా సినిమా చేయడానికి ఇష్టపడలేదు. మళ్ళి ఇన్నాళ్ళకు నందమూరి సినిమాలో శ్రీదేవి కనిపిస్తే అభిమానులకు అంత కన్నా కావాల్సింది ఏముంది. కాని ఇది తల్లి పాత్ర నా లేక అత్త పాత్ర నా అనే వివరాలు తెలియాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోయే ఈ సినిమా షూటింగ్ సంక్రాంతికి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ సినిమాకి వర్క్ చేస్తున్న అనిరుద్ రవిచందర్ ని ముందు అనుకున్నా టైంకి వర్క్ కంప్లీట్ అవ్వదేమో అనే అనుమానంతో దేవికే ఓటేసింది సినిమా యూనిట్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *