తీగలాగి.. డొంక కదిపిన సీఎం

రాజకీయ అవినీతి లేకుండా చేశాం.. ఇక ప్రభుత్వ శాఖల్లో అవినీతిని రూపుమాపుతాం.. అని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఆ విషయాన్ని ముందునుంచే తీవ్రంగా పరిగణిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన అవినీతి, అక్రమాలపై కూపీ లాగించి, డొంకంతా కదిలేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాణిజ్యపన్నుల శాఖలో బోధన్ చలాన్ల స్కాం, రవాణా శాఖలో సెకండ్ వెహికిల్ కుంభకోణం, తాజాగా ప్రభుత్వ భూముల బూటకపు రిజిస్ట్రేషన్‌పై దర్యాప్తుచేయిస్తూ, దానిని స్వయంగా పర్యవేక్షిస్తూ, బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీచేస్తున్నారు. సీఎం తీరు గమనిస్తే ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుతున్న ప్రభుత్వ శాఖల ప్రక్షాళనపై సీరియస్‌గా ఉన్నారని అర్థమవుతున్నదని సీనియర్ అధికారులు అంటున్నారు. వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల్లో అవినీతిని పూర్తిగా రూపుమాపి, రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచడానికి సీఎం కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు సీఎం తన చర్యల ద్వారా సంకేతాలిచ్చారని ఉన్నతాధికారులంటున్నారు.

ప్రజల సొమ్ము అవినీతి అధికారుల జేబులకు పోకుండా నేరుగా ఖజానాకు చేరితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 17% నుంచి మరింత పెరిగే అవకాశముందన్న కోణంలో సీఎం చర్యలను తీసుకుంటున్నారని వారు చెప్తున్నారు. వాణిజ్యపన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ శాఖల నుంచి రాష్ట్ర ఖజానాకు ఏటా దాదాపు రూ.50 వేల కోట్ల రాబడి వస్తున్నది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ శాఖల రాబడి పెరిగి రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. దానికి మించి ఈసారి 17.5% వృద్ధిరేటు వచ్చింది.

ఖజానాకు రాబడి మరింత పెంచాలంటే పన్ను ఎగవేతలు, లీకేజీలు నివారించడంతోపాటు శాఖల్లో అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఏ మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నా ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నది. రవాణాశాఖలో సెకండ్ వెహికిల్ కుంభకోణంలో పదిమంది సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులను సస్పెండ్‌చేశారు. మరో 73మందిపై త్వరలో చర్యలుంటాయని సమాచారం. చలాన్ల కుంభకోణంలో నిందితుల నుంచి సొమ్ము రాబట్టడానికి అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. రూ.65కోట్ల గోల్‌మాల్‌లో ఇప్పటికే రూ.30కోట్లు వసూలుచేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇక అన్ని రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్‌మెంట్లలో భారీస్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖలో మొత్తం 141 సబ్‌రిజిస్ట్రార్లకుగాను 72మందిని బదిలీ చేయడం విశేషం.

పేషీల్లోను ప్రక్షాళనకు చర్యలు!
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ ఎత్తున చోటుచేసుకున్న భూ కుంభకోణం వెనుక ఎవరైనా బడా అధికారుల హస్తం ఉందా? మంత్రి, ఉన్నతాధికారుల పేషీల్లో ఏం జరుగుతున్నది? అనేదానిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడేవారికి ఎవరైనా అండగా నిలిచారా? అనే విషయంపై ఆరా తీస్తున్నదని తెలిసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *