‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 20 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. గురువారం నుంచి జూన్‌ 11 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మండుటెండల్లో స్కూళ్లను నడుపుతుండటంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’బుధవారం ‘మండుటెండల్లో బాల శిక్ష’పేరిట కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించారు. ఎండలతో బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్థులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. బుధవారం నుంచే సెలవులు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. అయితే అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లడంతో గురువారం నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్‌మెంట్లకు చెందిన పాఠ«శాలలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లోనూ కొనసాగుతున్న తరగతుల నిర్వహణను నిలిపివేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం ఈ నెల 22 పాఠశాలలకు ఆఖరు పనిదినం.

23వ తేదీ నుంచి వేసవి సెలవులుగా విద్యాశాఖ పేర్కొంది. అయితే ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’కథనం ప్రచురించడంతో ప్రభుత్వం ముందస్తు సెలవులను ప్రకటించింది. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని, జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినంగా వ్యహరించనున్నట్లు హైదబారాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌ చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *