కొలువుల మేళా – ఫైలు మీద సంతకం చేసిన సీఎం కేసీఆర్

విద్యుత్ శాఖలో ఒకేసారి 13,357 ఉద్యోగాల నియామకాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ శాఖ చరిత్రలో ఇంత భారీస్థాయిలో నియామకాలు జరుపనుండటం ఇదే ప్రథమం. 2012 నుంచి విద్యుత్ సంస్థల్లో ఖాళీలు ఏర్పడుతూ వచ్చినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటినుంచి ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని మంగళవారం ప్రగతిభవన్‌లో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల క్రితం విద్యుత్‌సంస్థలు ప్రతిపాదనలు పంపాయి. ఆ క్రమంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో లైన్‌మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఖాళీలను గుర్తించారు. ఇందులో 1,500వరకు నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని ఆదేశించిన సీఎం, ఈ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు 10వేల మందికి వెంటనే పదోన్నతులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఎంతో వేగంగా ముందుకు పోతున్నదని, పరిశ్రమలు, గృహ, వాణిజ్య అవసరాలకు 24గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది వ్యవసాయానికి కూడా 24గంటల విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభ దశను దాటి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతున్న క్రమంలో విద్యుత్ శాఖను బలోపేతం చేసేందుకే ఇంత పెద్ద ఎత్తున నియామకాలకు అనుమతి ఇస్తున్నామని సీఎం చెప్పారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్పీడీసీఎల్ చైర్మన్ గోపాల్‌రావు, టీఎస్ ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యుత్‌రంగంలో 13,357 కొత్త పోస్టుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) అధ్యక్షుడు సంపత్‌కుమార్,సెక్రటరీ జనరల్ రత్నాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

t-govt-to-appoint-13357-posts-in-electricity-dept
t-govt-to-appoint-13357-posts-in-electricity-dept
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *