భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం.. భారత్‌కు తప్పని ఓటమి

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ చేసిన స్కోరు 209. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో చేయాల్సిన పరుగులు 208. అప్పుడు పాండ్యా ఆడినట్టుగా ఒక్క బ్యాట్స్‌మన్‌ కుదురుకున్నా ఈ స్వల్ప లక్ష్యాన్ని అందుకునేదేమో! చివర్లో భువనేశ్వర్‌ అండతో అశ్విన్‌ (53 బంతుల్లో 5 ఫోర్లతో 37) పోరాటం చిన్నఆశ కలిగించినా అది అత్యాశే అయింది. దీంతో 42.4 ఓవర్లలో తమ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులు మాత్రమే చేసిన భారత్‌.. 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ప్రొటీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. డివిల్లీర్స్‌ (50బంతుల్లో 35) టాప్‌స్కోరర్‌. బుమ్రా, షమిలకు మూడేసి వికెట్లు.. భువీ, పాండ్యాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఫిలాండర్‌కు దక్కింది.
 
దెబ్బతీసిన బ్యాటింగ్‌: స్వల్ప లక్ష్యం ముందున్నా భారత బ్యాట్స్‌మెన్‌ దారుణంగా తడబడ్డారు. క్రీజులో కాసేపైనా నిలవలేకపోయారు. ఆఖర్లో అశ్విన్‌ కాస్త వికెట్ల పతనాన్ని ఆపాడు.. లేదంటే ఓట మి మరింత దారుణంగా ఉండేది. సీమ్‌ తో పాటు బంతి బౌన్స్‌ కూడా అవుతుండడంతో సఫారీ పేసర్లు రెచ్చిపోయారు. ఆరంభంలో ధవన్‌ (16) ధాటిగా ఆడినా విజయ్‌ (13) ఫి లాండర్‌ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. రెం డుసార్లు డీఆర్‌ఎస్‌ ద్వారా లైఫ్‌ లభించినా వినియోగించుకోలేకపోయాడు. 8వ ఓవర్‌లో ఫిలాండర్‌కే దొరికిపోయాడు. కొద్దిసేపటికే ధవన్‌ను మోర్కెల్‌ అవుట్‌ చేశాడు. నాలుగు ఓవర్ల తర్వాత పుజారా(4) కూడా నిరాశపరచగా, కోహ్లీ (28), రోహిత్‌ (10) కొద్దిసేపు పోరాడారు. అయితే డ్రింక్స్‌ విరా మం తర్వాత మరోసారి ఫిలాండర్‌ తన సీమ్‌ దెబ్బ రుచి చూపించడంతో కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడానికి తోడు పాండ్యా కూడా విఫలమవడంతో భారత్‌ 82 రన్స్‌కే 7వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్‌ అనంతరం అశ్విన్‌, భువనేశ్వర్‌ (13) బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కానీ ఫిలాండర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ నాలుగు బంతుల వ్యవధిలో చివరి మూడు వికెట్లను పడగొట్టాడు.

బౌలర్లు భళా..: తొలిసెషన్‌లో షమి, బుమ్రా సీమ్‌ ను సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోయారు. వీరితో పాటు భువీ చెలరేగడంతో 65/2 ఓవర్‌నైట్‌స్కోరుతో నాలుగోరోజు రెండోఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టు.. తొలిసెషన్‌ ముగిసేలోపే మరో 65 రన్స్‌కు మిగతా 8వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే ఆమ్లా (4) వికెట్‌ తీసిన షమీ.. నాలుగు ఓవర్ల తర్వాత రబాడ (5)ను కూడా అవుట్‌ చేశాడు. ఇక కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (0), డి కాక్‌ (8)లను బుమ్రా వెనక్కిపంపడంతో ఆ జట్టు 92 రన్స్‌కే 6వికెట్లు కోల్పోయింది. మరోవైపు డివిల్లీర్స్‌ ఒంటరి పోరాటం చేస్తూ స్కోరును పెంచేందుకు ప్రయత్నించినా సహకారం కరువైంది. చివర్లో భువీ.. కేశవ్‌ (15), మోర్నీ మోర్కెల్‌ (2)లను సాగనంపగా ఆఖరి వికెట్‌గా డివిల్లీర్స్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో వారి ఇన్నింగ్స్‌ ముగిసింది. అయితే గాయం కారణంగా సిరీస్‌‌‌‌కు దూరమైనట్టుగా ప్రకటించిన స్టెయిన్‌ (0)ను కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దించడం ఆశ్చర్యపరిచింది.

 ధోనీని దాటేసిన సాహా
విదేశీ గడ్డపై ఓ టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్‌ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత తొలి టెస్టులో సా హా ఏకంగా పది క్యాచ్‌లు అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకున్న తను రెండో ఇన్నింగ్స్‌లోనూ విశేషంగా రాణించి మరో ఐదు క్యాచ్‌లు పట్టేశాడు. అయితే ఈక్రమంలో అతడు ఎంఎస్‌ ధోనీ రికార్డును అధిగమించాడు. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్‌ టెస్టులో తను తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నాడు. ధోనీ టెస్టు కెరీర్‌లో అదే చివరి టెస్టు.
 1 రెండు ఇన్నింగ్స్‌లో నలుగురు భారత పేసర్లు కనీసం ఓ వికెట్‌ చొప్పున సాధించడం ఇదే తొలిసారి.

► తొలి ఇన్నింగ్స్‌లో మాకు దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకొని వారిని 220కే పరిమితం చేస్తే ఫలితం మరోలా ఉండేది. వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బ తీసింది. మూడు రోజులు కూడా మేం సమఉజ్జీలుగానే ఉన్నాం. 208 లక్ష్యం అనేది ఎలా చూసినా కష్టమైంది కాదు. అయితే మాలో ఒకరు 20–30 పరుగులు కాకుండా కనీసం 70–80 చేయాల్సింది. ఒక బౌలర్‌ తగ్గినా వారు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం దృష్టి పెట్టాల్సి ఉంది. మేం కూడా వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాం కాబట్టి పూర్తి వైఫల్యంగా కూడా చెప్పలేం. నిజానికి మా బౌలర్లు సర్వశక్తులూ ఒడ్డారు. వారికి నా సానుభూతి. ఇలాంటి పిచ్‌ ఎదురై మళ్లీ అవకాశం వస్తే దానిని వదులుకోం. బౌలర్లు ప్రత్యర్థిని కుప్పకూలిస్తే బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడి ఫలితం రాబడతాం.

స్కోరు బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 286
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 209
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మర్‌క్రామ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) పాండ్యా 34; ఎల్గర్‌ (సి) సాహా (బి) పాండ్యా 25; రబాడ (సి) కోహ్లీ (బి) షమి 5; ఆమ్లా (సి) రోహిత్‌ (బి) షమి 4; డివిల్లీర్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) బుమ్రా 35; డు ప్లెసిస్‌ (సి) సాహా (బి) బుమ్రా 0; డి కాక్‌ (సి) సాహా (బి) బుమ్రా 8; ఫిలాండర్‌ (ఎల్బీ) షమి 0; కేశవ్‌ (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 15; మోర్కెల్‌ (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 2; స్టెయిన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: 41.2 ఓవర్లలో 130 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-52, 2-59, 3-66, 4-73, 5-82, 6-92, 7-95, 8-122, 9-130, 10-130. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 11-5-33-2; బుమ్రా 11.2-1-39-3; షమి 12-3-28-3; పాండ్యా 6-0-27-2; అశ్విన్‌ 1-0-3-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: విజయ్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) ఫిలాండర్‌ 13; ధవన్‌ (సి-సబ్‌) మోరిస్‌ (బి) మోర్కెల్‌ 16; పుజారా (సి) డికాక్‌ (బి) మోర్కెల్‌ 4; కోహ్లీ (ఎల్బీ) ఫిలాండర్‌ 28; రోహిత్‌ (బి) ఫిలాండర్‌ 10; సాహా (ఎల్బీ) రబాడ 8; పాండ్యా (సి) డివిల్లీర్స్‌ (బి) రబాడ 1; అశ్విన్‌ (సి) డి కాక్‌ (బి) ఫిలాండర్‌ 37; భువనేశ్వర్‌ నాటౌట్‌ 13; షమి (సి) డు ప్లెసిస్‌ (బి) ఫిలాండర్‌ 4; బుమ్రా (సి) డు ప్లెసిస్‌ (బి) ఫిలాండర్‌ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: 42.4 ఓవర్లలో 135 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-30, 2-30, 3-39, 4-71, 5-76, 6-77, 7-82, 8-131, 9-135, 10-135. బౌలింగ్‌: ఫిలాండర్‌ 15.4-42-6; మోర్కెల్‌ 11-1-39-2; రబాడ 12-2-41-2; కేశవ్‌ 4-1-12-0.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *