ఉద్యోగాల జాతర – 40వేల పోస్టుల భర్తీకి అనుమతులు

రాష్ట్రంలో కొలువుల జాతర ముమ్మరంగా కొనసాగుతున్నది. విద్యుత్‌శాఖలో ఒకేసారి భారీస్థాయిలో 13,357 పోస్టుల భర్తీకి మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మరుసటిరోజే మరిన్ని శాఖలలో మరిన్ని పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. అన్నింటికి మించి నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీకి పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 8792 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్థికశాఖ తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 540 పోస్టుల భర్తీకి బుధవారం పచ్చజెండా ఊపింది. 52 వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడానికి టీఎస్‌పీఎస్సీకి అనుమతినిస్తూ పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సురేశ్‌చందా ఉత్తర్వులిచ్చారు. కాంట్రాక్ట్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల్లో 300 మందిని నియమించుకునేందుకు కూడా అనుమతి మంజూరు చేశారు. దివ్యాంగుల శాఖలో 224 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని శాఖ డైరెక్టర్ బీ శైలజ చెప్పారు. దీనికితోడు ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు ఫారెస్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించాలన్న ఆటవీశాఖ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1,305 బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఖాళీల భర్తీకి అధికారిక ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వెరసి.. మొత్తంగా 11,213 పోస్టుల్లో నియామక ప్రక్రియ మొదలుకానుంది. ఒకవైపు వరుసగా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తుంటే మరోవైపు వాటికోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), ఇతర శాఖలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నియామకాలను పూర్తి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 40వేల పోస్టుల భర్తీకి అనుమతులు రాగా, వాటిలో సగానికిపైగా నియామకాలు పూర్తి కావడం విశేషం. ఇందులో తెలంగాణ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, సింగరేణి, విద్యుత్‌శాఖ ద్వారా దాదాపు 20వేల పోస్టులు భర్తీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు సుమారు ఆరువేల ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయగా గురుకులాల్లో ,8400 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇవిలాఉంటే.. మరో వారంలో గ్రూప్-2 ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనిద్వారా 1032మంది ఉద్యోగాలను పొందనున్నారు. టీఎస్‌పీఎస్సీ తాజాగా రవాణాశాఖ కానిస్టేబుళ్ల ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 137 పోస్టులకుగాను ఎంపికైన 119మంది ప్రొవిజనల్ జాబితాను ప్రకటించింది. మహిళా అభ్యర్థుల కొరత కారణంగా 18 పోస్టుల ఫలితాలు వెల్లడి కాలేదని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

పీహెచ్‌సీల్లో 540

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా 53 కొత్త పీహెచ్‌సీల్లో 540 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో పీహెచ్‌సీలో వివిధ క్యాటగిరీల్లో పది పోస్టులను కేటాయించారు. వీటిలో రెండు సివిల్ సర్జన్, ఒక పబ్లిక్ హెల్త్ నర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నాలుగు స్టాఫ్ నర్స్, ఒక మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఒక గ్రేడ్-2 ఫార్మసిస్ట్, ఒక గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అనుమతులనిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అటవీశాఖలో 1305

అటవీశాఖలో ఉద్యోగాల ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా భర్తీ చేస్తున్నది. అటవీశాఖలో ఉద్యోగులు, కిందిస్థాయి అధికారుల సంఖ్య ఐదువేల వరకు ఉండగా అందులో 2,500కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు మొత్తం కలిపి దాదాపు 350 పోస్టుల భర్తీ బాధ్యతలను ఇటీవలే టీఎస్‌పీఎస్సీకి అటవీశాఖ అప్పగించింది. బాధ్యత మేరకు టీఎస్‌పీఎస్సీ ఆ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇంకా 1184 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టును బీట్ ఆఫీసర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఫలితంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులను రద్దు చేయనున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. పోస్టుల హోదాను పెంచాలన్న ప్రతిపాదన కారణంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. అటవీశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్థికశాఖ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టును బీట్ ఆఫీసర్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు రద్దవుతాయి. దీంతో ఖాళీగా ఉన్న 1,305 బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి లైన్ క్లియరైందని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

8,792 టీచర్ పోస్టుల భర్తీ

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ పక్షం రోజుల్లో వెలువడనుంది. దీనిద్వారా 8792 పోస్టులను భర్తీ చేయనున్నామని విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ప్రకటించారు. ఈ పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని కడియం తెలిపారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఈలోపే విద్యావాలంటీర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం పాత జిల్లాల ప్రాతిపదికనే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా విద్యాధికారుల ద్వారా జిల్లాలవారీగా ఖాళీల వివరాలను తెప్పిస్తున్నామని, వారంలో మరింత స్పష్టత వస్తుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ పేర్కొన్నారు.

డీఎస్సీతో తీరనున్న చిరకాలవాంఛ

పక్షం రోజుల్లో డీఎస్సీ ప్రకటన వస్తుందని కడియం శ్రీహరి వెల్లడించిన నేపథ్యంలో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత ఎంపీ బాల్కసుమన్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, టీఆర్‌ఎస్ విద్యార్థి నేత చిరుమళ్ల రాకేశ్ తదితరులు గతకొంత కాలంగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతుందని చెప్తూవచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. నిరుద్యోగుల ఆకాంక్షల మేరకు తక్షణం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఇప్పుడు 8792 పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటన చేశారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను కూడా ప్రభుత్వం అతిత్వరలోనే భర్తీ చేయనున్నదని సమాచారం.

దివ్యాంగుల శాఖలో 224

దివ్యాంగుల శాఖలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని దివ్యాంగుల, జువైనల్ హోం డైరెక్టర్ బీ శైలజ తెలిపారు. తమ శాఖలో 431 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. వీటిలో 207 పోస్టులను భర్తీ చేశామని, మిగతా 224 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. బుధవారం సచివాలయంలో దివ్యాంగుల సమస్యలపై ఎంపీ కవిత నేతృత్వంలో సంబంధిత సంఘాల ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగులకోసం ప్రత్యేకశాఖను ఏర్పాటు చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీతోపాటు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల.. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తున్నారని, దివ్యాంగులకు కూడా మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల శాఖ డీమెర్జర్‌తో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనంతరం శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశాన్ని సాధారణ పరిపాలన శాఖకు పంపామని తెలిపారు

వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 52

పశుసంవర్థక శాఖలో 52 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 489 పోస్టులకు అదనంగా వీటిని భర్తీ చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

కాంట్రాక్టు పద్ధతిలో 300 పోస్టుల భర్తీకి అనుమతి

కాంట్రాక్టు పద్ధతిలో 300 మంది లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్టులను రిటైర్డ్ పారా వెటర్నరీ ఉద్యోగులతో భర్తీచేయాలని జీవోలో పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ పే కింద నెలకు రూ.19,500 ఇవ్వనున్నారు. మొత్తం 11 నెలల కాలపరిమితితో ఈ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌కు సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *