సీఎం సొంత జిల్లాలో హెల్మెట్ ధరించి టీచర్ల పాఠాలు: ఎందుకంటే?

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పాఠశాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తోందీ కథనం. పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లకి ఓ పుస్త‌కం, బ్లాక్‌ బోర్డ్, చాక్‌పీస్ వంటికి అవ‌స‌ర‌మ‌వుతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇక్కడ మాత్రం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు చెప్ప‌డానికి టీచ‌ర్లు హెల్మెట్స్ ధరించాల్సి వ‌స్తోంది. ఈ పరిస్థితి చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల‌కొంది. ఆ పాఠ‌శాల‌లోని టీచ‌ర్లు హెల్మెట్ ధ‌రించి పాఠాలు చెబుతున్న దృశ్యాలను జాతీయ మీడియా ఛానెళ్లు సైతం ప్ర‌చురించడం గమనార్హం. టీచర్లకు ఈ దుస్థితి రావడానికి ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల పట్టింపులేని తనమే కారణం.

ఆ పాఠశాలలోని తరగతి గదుల్లోని సీలింగ్ ఇటీవల కురిసిన వర్షాలకి తడిసి ప్లాస్టరింగ్ రాలిప‌డుతోంది. ఒక్కోసారి వర్షం ఎక్కువ‌గా ప‌డితే క్లాస్ రూమ్‌లో వర్షపు నీరు ప‌డుతోంది. ఎంతో కాలంగా త‌మ‌ను వేధిస్తోన్న ఈ స‌మ‌స్య గురించి ప్ర‌భుత్వానికి తెల‌ప‌డానికి అక్కడి టీచర్లు ఇలా హెల్మెట్‌లు ధ‌రించి పాఠాలు చెబుతున్నారు.

గత మూడేళ్లుగా తాము ప‌డుతున్న బాధ‌ల గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ స‌మ‌స్య‌ తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండాపోతోంద‌ని ఆ పాఠ‌శాల విద్యార్థులు, టీచ‌ర్లు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. దీంతో జాతీయస్థాయిలో ఈ సమస్యకు ప్రచారం లభించింది. ఇప్పటికైనా ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులకు ప్రమాదకరంగా మారిన పాఠశాల సమస్యను తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం, అధికారులపై ఉందని స్ఠానికులంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *