అభివృధ్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ..!

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్‌ వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉభయసభల్లో చర్చ జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 40వేల మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామని, రాష్ట్ర విభజన తర్వాత రహిదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామం, ఆయా మండలాలకు అనుసంధానంగా రహదారి నిర్మించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అభివృద్ధిలో 13.2 శాతం, సేవారంగంలో 14.5 వృద్ధిరేటు సాధించామని, రాష్ట్రం ఏర్పడిన 9 నెలల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశామని గవర్నర్‌ తెలిపారు.

తెలంగాణ ఏర్పడ్డ ఆరు నెలల్లోనే కరెంట్ కష్టాలు అధిగమించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. సాగుకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతాంగానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.  ఎక్కడా లేని విధంగా తొలిసారి బీడీ కార్మికులకు రూ. 1000 పెన్షను ఇస్తున్నామన్నారు.

ఒంటరి మహిళలకు రూ. 1000 భృతి ఇవ్వబోతున్నామని చెప్పారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. రాష్ర్ట సాధనలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థియ సాయం చేస్తుందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా పారిశ్రామిక అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. పారిశ్రామిక అనుమతలు 15 రోజుల్లోనే ఇస్తున్నామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ర్టాభివృద్ధిలో సేవారంగానిది ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *