ఢిల్లీలో టీఆర్‌ఎస్ పోరు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తొలిరోజైన సోమవారం లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. రెండోరోజైన మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. లోక్‌సభ లోపల, బయట నిరసన తెలిపారు. ముస్లింలు, ఎస్టీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగ కల్పనలో మరిన్ని రిజర్వేషన్లు ఇచ్చేందుకుగాను ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 50% నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ గతేడాది ఏప్రిల్‌లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని నినదించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపిన ఎంపీలు 11 గంటల తర్వాత లోక్‌సభలో కూడా తమ నిరసన గళాన్ని వినిపించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనులతో లోక్‌సభ దద్దరిల్లింది. వారిని శాంతింపజేసేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి, ఉపనేత వినోద్‌కుమార్,ఎంపీ కవిత, బాల్కసుమన్ తదితరులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

ఇదే సమయంలో కావేరీ జల వివాదంపై తమిళనాడు ఎంపీలు, ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఆ రాష్ట్ర ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. ఎంపీల నిరసన ప్రతిధ్వనుల మధ్య సభను రెండుసార్లు వాయిదావేయాల్సి వచ్చింది. అనంతరం కరీంనగర్ ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష ఉపనేత బీ వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉద్యోగాల నియామకాలలో 50శాతానికి మించి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు అనుమతించిన దాఖలాలున్నాయని గుర్తుచేశారు. ఎం నాగరాజు, ఇతరులకు, కేంద్రం మధ్య కేసులో, అదేవిధంగా అశోక్‌కుమార్ అనే వ్యక్తికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన విషయాన్ని వివరించారు. ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుని తమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండు ప్రత్యేక కమిటీలను నియమించారని తెలిపారు. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీ సుధీర్ ఆధ్వర్యంలో కమిటీలను నియమించారని చెప్పారు.

రిజర్వేషన్ల అధికారాన్ని రాష్ర్టాలకే ఇవ్వాలి: ఎంపీ కవిత

రిజర్వేషన్లు 50% మించరాదని రాజ్యాంగంలో ఎక్కడాలేదని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు మాత్రమే ఒక తీర్పులో చెప్పిందని, పైగా అవసరమైనచోట 50శాతానికి మించి ఇవ్వవచ్చని తీర్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. మైనార్టీలు అన్ని వర్గాల కంటే వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించిందన్నారు. తమ రాష్ట్రంలో ప్రతిపాదించినవి మతపరమైన రిజర్వేషన్లు కావని, సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇవ్వాలని నిర్ణయించినవేనని కవిత స్పష్టంచేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం రిజర్వేషన్లపై కేంద్రానికి అధికారం ఉందని, దీన్ని సవరించి, రాష్ర్టాలకే రిజర్వేషన్లను నిర్ణయించే అధికారాన్నివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. విభజనచట్టంలో తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు కల్పించే విషయాన్ని కవిత ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీలు, రిజర్వేషన్ల పెంపు అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆమె తేల్చిచెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *