కొలువులన్నీ తెలంగాణ బిడ్డలకే..95% ఉద్యోగాలు స్థానికులకే..

తెలంగాణ బిడ్డలకు త్వరలో మరో స్వరాష్ట్ర ఫలితం దక్కనున్నది. మలిదశ ఉద్యమ ట్యాగ్‌లైన్లలో ఒకటైన తెలంగాణలోని ఉద్యోగాలు.. స్థానికులకే అతి త్వరలో వాస్తవరూపం దాల్చనున్నది. నూరుశాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కే లా రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదం లభించే అవకాశం ఉన్నది. ఆ వెంటనే నూతన జోనల్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేశారు. జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిన ముసాయిదా ప్రతిని కూడా అందించారు. మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నీళ్లు- నిధులు-నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవరూపంలోకి తెచ్చి చూపిస్తున్నది. ఇప్పటికే నిధుల సమస్యను పరిష్కరించగా, నీళ్ల కోసం అపరభగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నియామకాల్లో భాగంగా స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేదిశగా జోనల్ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు.

నియామకాల్లో రాష్ట్ర క్యాడర్ రద్దు

తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా నూతన జోనల్ విధానం రూపకల్పనకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్ వ్యవస్థ మాత్రమే ఉండేది. ఉమ్మడి రాష్ర్టాన్ని ఆరు జోన్లుగా ఏర్పాటుచేశారు. ఆరో జోన్‌లో భాగమైన హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చి స్థానికేతరులు తిష్టవేశారు. దీంతో తెలంగాణలోని నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. దీనిని సమూలంగా మార్చి స్థానికులకే అవకాశాలు దక్కేలా రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థలో రాష్ట్ర క్యాడర్‌ను రద్దుచేశారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో నియామకాలకు ప్రతిపాదించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, రాష్ర్టానికి జరిగిన అన్యాయాలను, కొత్త జోనల్ వ్యవస్థతో కలిగే ప్రయోజనాలను సీఎం కేసీఆర్ వివరించిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రపతి సం తకం పూర్తయి, గెజిట్ విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వస్తే రాష్ట్రంలో గ్రూప్-1 అధికారుల పోస్టులకు కూడా మల్టీజోనల్ సిస్టమ్‌లోనే నియామకాలు జరుగుతాయి. పదోన్నతుల ద్వారానే రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ జరుగుతుంది. దీంతో అన్ని స్థాయిలలో తెలంగాణ యువతకు అవకాశాలు లభిస్తాయి.
TSJOBS2

95 శాతం స్థానిక రిజర్వేషన్

గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్‌పోస్టుల భర్తీలో కల్పించిన రిజర్వేషన్ల నిష్పత్తి వల్ల కూడా తెలంగాణలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. జిల్లా పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ లేదు. దీనికితోడు ఓపెన్ క్యాటగిరీకి నాన్‌లోకల్ అని పేరు తగిలించి స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టారు. స్థానికులైన మెరిట్ అభ్యర్థులకు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు కేటాయించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తీరని నష్టం జరిగింది. తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనున్నది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది.
TSJOBS1

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *