సూర్యుడి ఉపరితలం తొలి చిత్రం
హవాయి(యూఎస్): ప్రపంచంలోనే అతిపెద్దదైన సోలార్ టెలిస్కోప్ సూర్యుడి ఉపరితలానికి సంబంధించితన తొలి చిత్రాన్ని తీసింది. మన సూర్యుడికి సంబంధించి ఇప్పటివరకూ అత్యధిక రిజల్యూషన్ కలిగిన చిత్రం ఇదే కావడం విశేషం.
అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్) తమ పరిశోధనల్లో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలను చిత్రీకరించింది. హవాయిలోని డేనియల్ కె. ఇనోయి సోలార్ టెలీస్కోప్ ద్వారా ఈ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇందులో సూర్యుడి ఉపరితలంపై ఉండే ప్లాస్మా బంగారు వర్ణంలో భగభగ మండుతూ కన్పించింది. ఈ ఫొటోలను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇంతకుముందు ఎన్నడూ చూడని సూర్యుడిని చూడండి..! సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన స్పష్టమైన చిత్రం ఇది’ అని ఎన్ఎస్ఎఫ్ పేర్కొంది. ఈ చిత్రాలతో సూర్యుడిని మరింత అర్థం చేసుకునేందుకు, భూమిపై దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు వీలు లభించినట్లయిందని వెల్లడించింది. ఇంకేం.. మండుతున్న అగ్నిగోళాన్ని మీరూ ఓసారి చూసేయండి..!