పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి ఉండాలన్నారు

 శంషాబాద్‌: చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పల్లె పగ్రతి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల అందరికి మాట్లాడే అవకాశం రాకపోతే నాయకులెవరూ బాధపడొద్దన్నారు. సభలో మాట్లాడకపోతే అవమానంగా భావించవద్దని.. గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వారిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీని నియమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం అంటే ఏమిటో నేడు కేసీఆర్‌ నిరూపించారని పేర్కొన్నారు. గతంలో రైతులు కరెంట్‌ కావాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగేవారని, కానీ ఇప్పుడు కరెంట్‌ ఎక్కువ అయ్యిందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత అధికంగా ఉండేదన్నారు. ప్రతి గ్రామం బడ్జెట్‌ను  సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్‌ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని.. చట్టాన్ని ప్రతి  సర్పంచ్‌ చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి ఉండాలన్నారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం గా ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *