రికార్డులు తిరగరాస్తున్న ‘టైగర్‌’.. భారీ వసూళ్లు!

సల్మాన్‌ ఖాన్‌ తాజా సినిమా ‘టైగర్‌ జిందా హై’ రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మూడోరోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌ సినీ చరిత్రలో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ‘టైగర్‌ జిందా హై’ ఘనత సొంతం చేసుకుంది. ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్‌కు  కొత్త జీవం నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం.

ఈ సినిమాకు యావరేజ్‌ రివ్యూలు వచ్చినా.. సల్మాన్‌ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ మౌత్‌టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 33 కోట్లు, రెండోరోజు శనివారం రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆదివారం ఏకంగా 45.53 కోట్లు కలెక్ట్‌ చేసి.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. నేడు క్రిస్మస్‌ సందర్భంగా సోమవారం కూడా సెలవు కావడంతో ఈ సినిమా ప్రారంభ వసూళ్లు మరింతగా దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది. ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దూసుకుపోతున్న ‘టైగర్‌ జిందా హై’ సినిమా మూడురోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలుచేసిందని తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. అసాధారణరీతిలో వసూళ్లు రాబడుతున్న ‘టైగర్‌ జిందా హై’.. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ సినిమా ‘సుల్తాన్‌’ రికార్డులను తిరగరాసింది. సుల్తాన్‌ మూడురోజుల్లో రూ. 104 కోట్లు వసూలుచేయగా.. టైగర్‌ అంతకుమించి రాబట్టడం గమనార్హం. సల్మాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా అలీ అబ్బాస్‌ తెరకెక్కిన ’టైగర్‌ జిందా హై’ .. ఏక్‌ థా టైగర్‌ చిత్రానికి సీక్వెల్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *