డిశంబర్ 30 కూడా వచ్చేసింది…

నేటితో పాత రూ.500, 1,000 నోట్లకి ఆయువు చెల్లిపోతుంది. కనుక ప్రజలందరూ ఈరోజు అంటే శుక్రవారం సాయంత్రం బ్యాంకులు మూసేలోగానే తమ తమ ఖాతాలలో పాత నోట్లని జమా చేసుకోవడం మంచిది. లేకుంటే డిశంబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కౌంటర్లలో జమా చేసుకోవచ్చు కానీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ కావచ్చు. ఆ కౌంటర్లలో జమా చేయబోయే ప్రతీ రూపాయికి తగిన ఆధారాలు, లెక్కలు చూపవలసి ఉంటుంది.

ఇది విదేశాలలో ఉండి భారత్ రాలేకపోయిన వారికి, అనారోగ్యం లేదా మరేదైనా ఇతర కారణాల చేత బ్యాంకులలో జమా చేసుకోలేకపోయిన వారికి మిగిలిన ఏకైక అవకాశంగా భావించవచ్చు. కానీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోతే, మార్చ్ 31 తరువాత పాత నోట్లు కలిగి ఉండటం కూడా చట్ట ప్రకారం నేరం అవుతుంది. దానికి చాలా బారీగా జరిమానాలు కూడా చెల్లించవలసి వస్తుంది. కనుక ఇంతవరకు పాత రూ.500, 1,000 నోట్లని మార్చుకోలేని వారు అందరూ నేడే బ్యాంకులకు వెళ్ళి తమ ఖాతాలలో జమా చేసుకోవడం మంచిది.

కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పధకం క్రింద ఇంతవరకు ఎవరైనా నల్లధనం జమా చేసి ఉన్నా వారి వివరాలు కేంద్రప్రభుత్వం రహస్యంగా ఉంచుతామని చెప్పినందున, ఎంత మంది ఎంత మొత్తం జామా చేసారనే విషయం బహుశః ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రకటిస్తారేమో. కనుక ఇక రేపటి నుంచి ఏర్పాటు చేయబోయే రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనన్ని జమా చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ గత రెండు నెలలలో నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి ప్రయోగించిన నక్కజిత్తులన్నిటినీ కేంద్రప్రభుత్వం కూడా కళ్ళారా చూసింది కనుక మళ్ళీ వారికి అటువంటి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *