తిరుమలకు కేసీఆర్: వెలసిన స్వాగత ఫ్లెక్సీలు, తొలగింపు!

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం తిరుమలకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6.30 గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుని స్వామివారికి కమలం నమూనాతో చేయించిన స్వర్ణ సాలిగ్రామ హారం, ఐదు పేటల మకర కంఠెను టీటీడీ ఉన్నతాధికారులకు అందించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. స్వర్ణ కానుకలు సమర్పించుకుంటానని శ్రీవారికి కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ మేరకు రూ.5 కోట్లతో ఆభరణాలు తయారు చేయించారు. ఈ ఆభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు.

ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం

శ్రీవారి దర్శనానంతరం తిరుమలలో జరిగే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధ్యక్షుడు పెద్ది సుదర్శనరెడ్డి వివాహానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు బస చేసిన విశ్రాంతి సముదాయం నుంచి బయలుదేరి తిరుచానూరుకు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

మధ్యాహ్నం 12.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు వస్తున్న కేసీఆర్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సోమవారం చర్చించారు.

వెలసిన స్వాగత ఫ్లెక్సీలు: పలుచోట్ల చించివేత, తొలగింపు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్‌ను కీర్తిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్‌పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన భారీ వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేశారు.

అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొరుగు తెలుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *