పాక్లో బుమ్రా ఫ్లెక్సీలు..

కొన్ని సందర్భాల్లో చిన్న తప్పిదాలకి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో చిన్న చిన్న తప్పిదాలు భారీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. భారత్, పాక్ మ్యాచ్లో బుమ్రా చేసిన ఓ చిన్న తప్పిదాన్ని ఊటంకిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు సామాన్యులకు చేరడానికి పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బూమ్రా వేసిన నోబాల్ ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశం ఆరంభంలోనే చేజారింది. పాక్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ మూడు పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను కీపర్‌ ధోనీ ఒడిసి పట్టినా అది నోబాల్‌ కావడంతో జమాన్‌కు లైఫ్‌ లభించింది. 3 పరుగుల వద్ద అవుట్ కావాల్సిన ఆటగాడు 114 పరుగులతో సెంచరీ చేశాడు.

బుమ్రా వేసిన ఒక్క నోబాల్  టీమిండియా పాలిట శాపమైంది. చిన్న తప్పిదం ఎంతటి ప్రభావం చూపుతుందో అనే హెచ్చరికతో .. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా అంతే ప్రమాదం జరుగుతుందన్న అర్థంలో పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు బుమ్రా నోబాల్‌ వేసిన చిత్రాన్ని ఆ పట్టణ కూడళ్లలో ఏర్పాటు చేశారు.

మరోవైపు జైపూర్‌ పోలీసులు కూడా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన ఎంత ప్రమాదంతో కూడుకున్నదో తెలియజేస్తూ.. బుమ్రా నోబాల్‌ చిత్రంతో పాటు జీబ్రాలైన్‌ వద్ద కార్లు ఆగి ఉన్న ఫోటోను కలిపి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జీబ్రాలైన్‌ వద్ద ఆగితే క్షేమమని.. చిన్న తప్పిదాలు కూడా భారీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కాగా, జైపూర్ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బుమ్రా స్పందిచాడు. వెల్ డన్ జైపూర్ పోలీస్.. దేశం కోసం పోరాడే వారికి మీరిచ్చే గౌరవమిదేనా అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు. తప్పులు చేయడం మావన సహజం. పనిలో మీరు కూడా చేసే పొరపాట్లను నేనేం అపహాస్యం చేయను. ఆందోళన చెందకండి అంటూ జైపుర్‌ ట్రాఫిక్‌ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్‌ చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *