స్నేహం కోసం హీరోను మార్చేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌ చిత్రంలో కీలకమార్పు?

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకు ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. పాటించే విలువలు. ఎవరికైనా మాట ఇస్తే దానిని పక్కాగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు అనే పేరు త్రివిక్రమ్‌కు ఉంది. మానవ సంబంధాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా సినిమాల్లో కూడా వాటిని బలంగా చూపుతాడు. గతంలో ఇచ్చిన మాట కోసం తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో ఓ హీరోనే మార్చారనే ఓ నిరాధారమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..

తాజాగా ప్రారంభమైన ఎన్టీఆర్ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్‌ను అనుకొన్నారట. ఎన్టీఆర్, నారా రోహిత్ ఇద్దరూ నందమూరి కుటుంబానికి చెందిన వారే కావడంతో సినిమాకు ఓ క్రేజ్ కూడా వస్తుంది అని ఆశించారు.

కానీ తీరా షూటింగ్ ప్రారంభమయ్యే సరికి నారా రోహిత్ ఈ చిత్రంలో లేడనే విషయం ఆసక్తిని రేకెత్తించింది. నారా రోహిత్ స్థానంలో ప్రస్తుతం తన మిత్రుడు సునీల్ తెరపైకి రావడం ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ డిసిషన్ వెనుక గతంలో సునీల్‌కు త్రివిక్రమ్ మాటివ్వడమే అనే మాట వినిపిస్తున్నది.

కామెడీ నటుడిగా విశేష ప్రజాదరణను కూడగట్టుకొన్న సునీల్ హీరో అవతారం ఎత్తాడు. మొదట్లో విజయాలు పలకరించినా ఆ తర్వాత ముఖం చాటేశాయి. హీరోగా స్థిరపడటానికి సునీల్ సిక్స్ ప్యాక్ లాంటి ప్రయోగాలు చేశాడు. కానీ ఈ మధ్య బొత్తిగా విజయాలు లేవు. దాంతో సునీల్‌లో టెన్షన్ మొదలైంది.
సునీల్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో త్రివిక్రమ్ తన స్నేహితుడిని ఆదుకోవడానికి రంగంలో దిగినట్టు సమాచారం. ఎన్టీఆర్, నారా రోహిత్‌ ఎలా ఒప్పించాడో ఏమో గానీ సునీల్‌ను ఎన్టీఆర్ సినిమాలోకి లాగేశాడట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *