వెనక్కి తగ్గిన ట్రంప్‌:కొత్త ఆదేశాలు త్వరలో​

వాషింగ్టన్‌: ట్రావెల్‌ బ్యాన్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌  వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది.  ఏడు ముస్లిం దేశాల ముస్లిం ప్రజలపై తాత్కాలిక  నిషేధం విధిస్తూ ఇటీవల జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలపై   ఆయన పునరాలోచనలో పడ్డారు.  ముఖ్యంగా  అమెరికా కోర్టులు ట్రంప్‌కు షాకిచ్చిన నేపథ్యంలో  దిగి వచ్చిన ట్రంప్‌ త్వరలోనే  కొత్త ఆదేశాలను జారీ చేయనున్నట్టు స్వయంగా ప్రకటించారు.

దేశ భద్రత రీత్యా  అంటూ డోనాల్డ్ ట్రంప్  తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ కు  కోర్టులు, ఇతర వర్గాల తీవ్ర వ్యతిరేకత రావడంతో  కొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై  దృష్టి పెట్టక తప్పలేదు.  స్వల్పమార్పులతో “బ్రాండ్ న్యూ ఆర్డర్”  ను త్వరలోనే జారీ చేయనున్నట్టు ట్రంప్‌  ఎయిర్ ఫోర్స్ వన్ విలేకరులతో చెప్పారు.    సోమవారం లేదా మంగళవారం గానీ ఈ కొత్త ఆదేశాలు రానున్నట్టు  ఆయన చెప్పారు.  జాతీయ భద్రతా కారణాల రీత్యా ఇమ్మిగ్రేషన్‌ బ్యాన్‌ ఆర్డర్‌ చాలా  కీలకమైనదనీ, దీనిపై  చర్యను “చాలా వేగంగా” తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కోర్టు నిర్ణయం నేపథ్యంలో “అదనపు భద్రత” అవసరమని ట్రంప్‌  పునరుద్ఘాటించడం  గమనార్హం.

అయితే ఈ కొత్త ఆదేశాలు ఎలా ఉండనున్నాయి?ముఖ్యంగా ముస్లిం  ప్రజలపై బ్యాన్‌ ను పూర్తిగా ఉపసంహరించుకుంటారా లేక కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

కాగా ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్ దేశాల ముస్లిం వీసా హోల్డర్లు  తాత్కాలిక నిషేదానికి గురికావడం  ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన  దిగ్గజ కంపెనీలు   ఇమ్మిగ్రేషన్‌ బ్యాన్‌పై  ఆందోళన వ్యక్తం చేస్తూ  న్యాయపోరాటానికి దిగాయి. దీంతో ఈ  పిటిషన్లను విచారించిన శాన్‌ఫ్రాన్సిస్కో  కోర్టు  ట్రంప్‌ ఆదేశాలను నిలిపి వేసింది. అంతకుముందు సియిటెల్‌ కోర్టుకూడా ఈ  ఆదేశాలను తాత్కాలింగా నిలిపివేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *