తుమ్మల హుషారెంతో కేసీఆర్ కు అర్థమైంది

సమర్థత ఉందని తెలిసినా అదెంతన్నది తెలిసినప్పుడు.. అంచనాలకు మించి ఉందన్న విషయం అర్థమైనప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉంది. మంత్రి తుమ్మల సమర్థత మీద కేసీఆర్ కు సందేహం లేనప్పటికి.. ఆయనలోని పని మంతుడు ఎంతన్న విషయం ఇప్పుడాయనకు స్పష్టంగా అర్థమైంది. భక్తరామదాసు ప్రాజెక్టు పనుల్ని తన భుజ స్కందాల మీద వేసుకొని.. ప్రత్యేక శ్రద్ధతో అన్నితానై చేసిన తీరుతో కేసీఆర్ ఖుషీఖుషీగా ఉన్నారు.

కించిత్ కష్టం లేకుండానే.. ఒక అద్భుతమైన రికార్డు తనఖాతాలో పడటాన్ని ఏ ముఖ్యమంత్రి మాత్రం ఎంజాయ్ చేయకుండా ఉంటారు. కేవలం పది నెలల రికార్డు సమయంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయటానికి మించిన సమర్థత ఏముంటుంది? అందుకే.. ఈప్రాజెక్టు సందర్భంగా తుమ్మలను తెగ పొగిడేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆసక్తికరమైన పిట్టకథను చెప్పుకొచ్చారు.

ఒక ఊళ్లో ఒక ఇంటికి తొందరపడే చుట్టం ఒకరు వచ్చారట. ఆయన పోతా.. పోతా అని తొందరపెడితే.. ‘చాలా దూరం పోవాలి కద బిడ్డా. ఇంకా అన్నం తయారు కాలేదు. రాత్రిది కొద్దిగా చద్దన్నం ఉంది. తిని వెళ్లు’ అని పెద్దమ్మ అన్నదట. దానికి ఆ చుట్టం బదులిస్తూ.. ‘అట్లేం లేదు పెద్దమ్మ.. చద్దన్నం తింటా.. ఉడుకన్నం అయ్యే దాక ఉంటా అన్నాడట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ చుట్టం లాగానే ఉన్నాడు. ముందు కొన్ని పనులు చేయించుకొని.. అవి పూర్తి కాక ముందే మరికొన్ని పనులకు హామీలు ఇప్పించుకున్నారు. ఇలాంటి నాయకులు ఉంటే ఆశించిన అభివృద్ధి జరుగుతుంది’’ అని చెప్పిన కేసీఆర్ మరో కీలక వ్యాఖ్య చేశారు. తుమ్మల హుషారు అని తెలుసు కాని ఇంత హుషారని అనుకోలేదని పొగిడేశారు. తన పనులతో ముఖ్యమంత్రి ఇమేజ్ నుమరింత పెంచే మంత్రిని కేసీఆర్ లాంటి సీఎం పొగడకుండా ఉంటారా..?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *