మూవీ రివ్యూ: వంగవీటి

చిత్రం : ‘వంగవీటి’

నటీనటులు: సందీప్ కుమార్ – నైనా గంగూలీ – శ్రీతేజ్ – వంశీ చాగంటి – కౌటిల్య తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్ – దిలీప్ వర్మ – సూర్య చౌదరి
రచన: రాధాకృష్ణ – చైతన్య ప్రసాద్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

‘రక్తచరిత్ర’ తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదు. ‘వంగవీటి’ ఆ లోటును తీర్చే సినిమాలా కనిపించింది. ‘రక్తచరిత్ర’కు అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్ని కథావస్తువుగా తీసుకున్న వర్మ.. ఈసారి ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాల్ని ఎంచుకున్నాడు. ఎంతో ఆసక్తిని.. ఉత్కంఠను రేకెత్తించిన ఈ వివాదాస్పద చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విజయవాడలో చిన్న రౌడీగా ప్రస్థానం ఆరంభించి.. కమ్యూనిస్టు నేత వెంకటరత్నం అండతో నగరాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు రాధా (సందీప్ కుమార్). రాధా ఎదుగుదల వెంకటరత్నానికి కంటగింపు అవుతుంది. అతణ్ని అవమానిస్తాడు. దీంతో రాధా.. వెంకటరత్నాన్ని మట్టుబెట్టి విజయవాడను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. ఆపై రాధాకు.. అన్నదమ్ములైన గాంధీ (కౌటిల్య).. నెహ్రూ (శ్రీతేజ్) దగ్గరవుతారు. ఇంతలో తమ నేతను మట్టుబెట్టాడన్న కోపంతో వెంకటరత్నం పార్టీ మనుషులు రాధాను చంపేస్తారు. దీంతో రాధా తమ్ముడైన రంగా అతడి స్థానంలోకి వస్తాడు. అక్కడి నుంచి పరిస్థితులు ఎలా మలుపు తిరిగాయి.. రంగా ప్రస్థానం ఎలా సాగింది.. ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

హింసతో ముడిపడిన నిజ జీవిత గాథల్ని రసవత్తరంగా తెరకెక్కించడంలో వర్మ శైలే వేరు. వాస్తవ కథలో ఎంత విషయం ఉంటే.. దాన్ని అంత ఆసక్తికరంగా చెప్పడంలో వర్మ నేర్పరి. ‘వంగవీటి’లోనూ వర్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. టేకింగ్ పరంగా వర్మ పీక్స్ లో కనిపిస్తాడిందులో. మర్డర్ సీన్స్ ను ఉత్కంఠభరితంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించడంలో వర్మ ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుంది. ఒక హత్య జరిగే తీరును వర్మ కంటే బాగా ఇంకెవరూ చూపించలేరేమో అనిపిస్తాయి ఇందులోని సన్నివేశాలు. కాకపోతే ‘వంగవీటి’ సినిమా అంతటా కూడా ఈ హత్యలే కనిపిస్తాయి. ఆ హత్యలకు అటు ఇటు జరిగిన విషయాలన్నింటినీ వర్మ విస్మరించడం ఈ చిత్రంలోని బలహీనత.

తెరమీద మర్డర్ సీన్లను రసవత్తరంగా చిత్రీకరించడం తన బలం కాబట్టి.. వర్మ ప్రధానంగా వాటి మీదే దృష్టిపెట్టినట్లున్నాడు. బహుశా చాలా ఏళ్ల పాటు జరిగిన కథను రెండున్నర గంటల్లో చెప్పేటపుడు అన్ని అంశాల్నీ కవర్ చేయడం సాధ్యం కాదని.. అదే సమయంలో తాను ఎంచుకున్న కథలోని ఏ హత్యనూ అతను విస్మరించలేడు కాబట్టి వాటి మీదే ఫోకస్ పెట్టినట్లున్నాడు వర్మ. తెరమీద రక్తపాతాన్ని చూపించడాన్ని అమితంగా ఇష్టపడే వర్మ.. తెరమీద ఒక్కో మర్డర్ ను తనివితీరేలా డీటైల్డ్ గా చూపించడంతో చాలా సమయం ఖర్చయిపోయింది. ఒక హత్యకు నాంది.. దాని తాలూకు ప్రణాళిక.. అమలు.. ఇలా ఒక్కో హత్యకు సంబంధించిన వ్యవహారం ఒకదాని తర్వాత ఒకటి సాగిపోతాయి.

ఆరంభంలో వెంకటరత్నం ఎపిసోడ్ ఆసక్తికరంగా మొదలై.. వర్మ ముద్ర స్పష్టంగా కనిపించే మర్డర్ సీన్ తో ముగుస్తుంది. ఈ హత్యను చిత్రీకరించిన తీరు ‘వావ్’ అనిపిస్తుంది. ఐతే ఆ తర్వాత ఇలాంటి హత్యలు చూస్తూ చూస్తూ వెళ్తుంటే బోర్ కొట్టేస్తుంది. ఆరంభంలో ఉన్నంత గ్రిప్పింగ్ గా ఆ తర్వాతి సన్నివేశాలుండవు. ఇలాంటి సినిమాలో కథానాయికకు ఒక ఇంట్రో సాంగ్.. పెళ్లి పాట లాంటివి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో వర్మకే తెలియాలి. బ్యాగ్రౌండ్లో వచ్చే ‘మరణం’ లాంటి ఒకట్రెండు పాటలు ఓకే కానీ.. మిగతా పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్లయ్యాయి. టెంపోను దెబ్బ తీశాయి. కథలో హత్యలు తప్ప ఇంకే మలుపులూ కనిపించవు. రాజకీయ అంశాలు.. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన లోతుల్లోకి వెళ్లలేదు. వంగవీటి.. దేవినేని కుటుంబాల్లో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే విషయంలో ఒక స్టాండ్ ఏమీ తీసుకోకుండా బ్యాలెన్స్ పాటించాడు వర్మ. అలాగే ప్రధాన పాత్రలకు సంబంధించి లోతుల్లోకి కూడా వెళ్లలేదు. వివాదాస్పద అంశాల్ని దాదాపుగా కప్పెట్టేశాడు. చివర్లో రంగా హత్యకు సంబంధించి ప్లానింగ్ ఎలా జరిగింది.. అందులో ఎవరి ప్రమేయం ఉందన్నది మాత్రం చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే రంగా హత్యతో ముగిసే క్లైమాక్స్ అనుకున్నంత డ్రామా.. ఉత్కంఠ లేదు.

టేకింగ్ పరంగా ప్రతి సన్నివేశంలోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఒకప్పటి విజయవాడ వాతావరణాన్ని సాధ్యమైనంత మేర చూపించే ప్రయత్నం చేశాడు. వరుస హత్యలు మొహం మొత్తేలా చేసినా.. టేకింగ్ పరంగా ఆ సన్నివేశాలు వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. సినిమాలో అక్కడక్కడా వర్మ మార్కు చమక్కులు కనిపిస్తాయి. రాధా మర్డర్ ప్లాన్ జరుగుతున్నపుడు ‘‘రాధా ఎవరో ఎలా గుర్తుపట్టాలి’’ అని అడిగితే.. ‘‘మీలో ఎవరైనా ఆ గుంపులో వాళ్లకు నమస్కారం పెట్టండి. ఎవరు తిరిగి నమస్కారం పెడితే వాడే రాధా’’ అని చెప్పే సీన్ అందుకు ఓ ఉదాహరణ. చివర్లో రంగా మరణం తర్వాత కెమెరాను వెనుక వైపున్న దుర్గమ్మ వైపు తీసుకెళ్లి.. ‘‘ఈ హత్యలన్నింటికీ ప్రత్యక్ష సాక్షి అయిన దుర్గమ్మ నోరు విప్పకుండా ఏ హావభావాలు లేకుండా సైలెంటుగా ఉండిపోతుంది’’ అంటూ తన వాయిస్ ఓవర్ తో సినిమాను ముగించిన తీరులోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది.

ఒక హత్య దానికి ప్రతీకారం.. మళ్లీ ఇంకో హత్య దానికి ప్రతీకారం.. ఇలా సిరీస్ ఆఫ్ మర్డర్స్ లాగా సాగిపోతుంది ‘వంగవీటి’. అంతే తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. పాత్రల లోతుల్లోకి వెళ్లలేదు. ‘రక్తచరిత్ర’లో బుక్కారెడ్డి తరహాలో విలక్షణమైన.. సినిమాను నిలబెట్టే బలమైన పాత్ర లేకపోవడం ‘వంగవీటి’ బలహీనత. వాస్తవంగా రాధాతో పోలిస్తే.. రంగానే పెద్ద లీడర్. ఐతే సినిమాలో రాధా పాత్ర కాసేపే ఉన్నా బాగా ఎలివేట్ అయింది కానీ.. రంగా పాత్రకు స్క్రీన్ టైం ఎక్కువున్నప్పటికీ ఆ పాత్ర అనుకున్నంతగా పండలేదు. రంగా పాత్రను సరిగా బిల్డ్ చేయకపోవడం.. అతడి ఎదుగుదలను సరిగా చూపించకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఓవరాల్ గా ‘వంగవీటి’ వర్మ తీసిన ‘బెటర్’ సినిమాల్లో ఒకటనిపించుకుంటుంది కానీ.. ఆయన తీసిన ‘వన్ ఆఫ్ ద బెస్ట్’ సినిమాల్లో ఒకటి కాదు. ఆయన అన్నట్లు ‘ది బెస్ట్’ అసలే కాదు.

నటీనటులు:

సందీప్ కుమార్ రాధా.. రంగా పాత్రలు రెండింట్లోనూ సులువుగా ఒదిగిపోయాడు. తక్కువ నిడివిలో ముగిసిపోయే రాధా పాత్రలో అతను ఇంటెన్సిటీ చూపించాడు. క్లోజప్ షాట్లలో అతను ఇచ్చిన హావభావాలు ఆకట్టుకుంటాయి. స్టేచర్ ఉన్న పాత్రల్ని కొత్తవాడైనా బెరుకు లేకుండా కాన్ఫిడెంట్ గా చేశాడతను. అతడి బాడీ లాంగ్వేజ్.. వాయిస్ కూడా బాగా కుదిరాయి. సందీప్ ను ఈ పాత్రలకు ఎంచుకుని.. ఆ దిశగా ట్రాన్స్ ఫామ్ చేయడంలో వర్మ ముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా ఆకట్టుకుంటారు. సాఫ్ట్ గా కనిపించే వంశీ చాగంటి.. దేవినేని మురళి పాత్రలో ఆశ్చర్యపరిచాడు. పాత్ర తాలూకు మార్పుల్ని అతను చక్కగా చూపించాడు. నెహ్రూ పాత్రలో శ్రీతేజ్ కూడా ఆకట్టుకున్నాడు. నైనా గంగూలీ.. కౌటిల్య కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

వర్మ సినిమా అంటే.. సాంకేతిక నిపుణులంతా ఆయన స్టయిల్లో పని చేయాల్సిందే. ‘వంగవీటి’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. సినిమాకు ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పని చేసినా.. యూనిఫార్మిటీ కనిపిస్తుంది. దాన్ని బట్టే అందరూ వర్మ శైలిలో పని చేశారని అర్థమవుతుంది. వర్మ మార్కు కెమెరా యాంగిల్స్.. ఏరియల్ షాట్స్ ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రవిశంకర్ మ్యూజిక్ ఓకే. గత సినిమాలతో పోలిస్తే నేపథ్య సంగీతంలో లౌడ్ నెస్ కొంచెం తగ్గించాడు. ‘మరణం’ సాంగ్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. మాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సంక్షిప్తంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. ‘‘అవసరం వందేళ్లకు సరిపడా అనుభవాన్ని నేర్పిస్తుంది’’ తరహా ఫిలసాఫికల్ మాటలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి మాటలు ఎక్కువగా వర్మ వాయిస్ ఓవర్లో వినిపిస్తాయి. ఇక దర్శకుడిగా వర్మ తన ముద్రను చూపించాడు. సినిమా అంతటా ఆయన వినిపిస్తాడు. కనిపిస్తాడు. టేకింగ్ పరంగా వర్మకు ఫుల్ మార్కులు పడతాయి కానీ.. జనాలు ఆశించినంత బోల్డ్ గా.. వివరంగా.. ఆసక్తికరంగా వర్మ ‘వంగవీటి’ కథను చెప్పలేకపోయాడు.

చివరగా: వంగవీటి.. టేకింగ్ ఓకే.. డెప్త్ లేదు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *